ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్‌ ఫైర్‌.. నిధులు కట్‌

-

రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతుండటంతో అగ్రరాజ్యం అమెరికా చిగురాటకుల వణికిసోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, వైట్‌హౌస్‌ అధికారులు కరోనాను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తుందని కొద్ది రోజులుగా అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా గురించి డబ్ల్యూహెచ్‌ఓ సరైన హెచ్చరికలు జారీచేయకపోవడం వల్లే అమెరికాలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ట్రంప్‌ ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ట్రంప్‌ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా నుంచి ఇవ్వాల్సిన నిధుల్ని నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. డబ్ల్యూహెచ్‌ఓ చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కరోనా వైరస్‌ తీవ్రతకు సబంధించి డబ్ల్యూహెచ్‌ఓ వద్ద సమాచారం ఉన్నప్పటికీ.. దానిని తమతో పంచుకోవడానికి ఇష్టపడలేదని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి ఎదుర్కొవడంలో, ప్రపంచ దేశాలకు జాగ్రత్తలు జారీ చేయడంతో డబ్ల్యూహెచ్‌ఓ తప్పటడుగులు వేసిందన్నారు. చైనాలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆ దేశ ప్రయాణాలపై అమెరికా నిషేధం విధిస్తే డబ్ల్యూహెచ్‌ఓ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిందని గుర్తుచేశారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, అమెరికాలోని దాదాపు 4 లక్షల మందికి కరోనా సోకింది. కరోనా బారినపడి అమెరికాలో ఇప్పటివరకు 12 వేలకు పైగా మృతిచెందారు.

Read more RELATED
Recommended to you

Latest news