ప్రపంచాన్నికుదిపేస్తున్న కరోనా వైరస్.. కంటికి కనిపించకపోయినా.. కళ్ల ముందున్న ప్రపంచాన్ని మాత్రం అతలాకుతలం చేస్తున్న పరిణామాన్ని మనం చూస్తున్నాం. ఏదైనా ప్రమాదం జరిగి ఒక్కళ్లో ఇద్దరో చనిపోతేనే గగ్గోలు పెట్టే అమెరికాలో ఇప్పుడు వేలల్లో మరణాలు సంభవించాయి. ఆ దేశ అధినేత ట్రంప్ తమ దగ్గర కరోనా లక్షమందిని కబళిస్తుందని మీడియాతో చెప్పేశారు. అత్యంత అధునాతన సామగ్రి, వైద్య సదుపాయాలు, వైద్యులు ఉన్న అమెరికాలోనే ఇలాంటి పరిస్థితిని కల్పించిన కరోనా.. ఇక, ఇటలీని ఎలా ఒణికిస్తోందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా ఇరాన్ తదితర దేశాలు కూడా చివురుటాకుల్లా ఒణికిపోతు న్నాయి. అత్యంత ఆధునికతను ఒంటబట్టించుకుని అగ్రరాజ్యాలుగా భాసిల్లుతున్న ఐరాపాలోని దేశాలు కూడా కరోనా ఎఫెక్ట్‌తో కకావికలం అవుతున్నాయి.
ఇక, మన దగ్గర పరిస్థితి ఇప్పటికిప్పుడు బాగుందని అనిపిస్తున్నా.. మేడిపండుమాదిరిగానే తలపిస్తోంది. మరో రెండు వారాలు గడిస్తే.. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మూడు పదుల్లో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్‌డౌన్లు ప్రకటించాయి. దీంతో గడిచిన నెల రోజులుగా ప్రపంచ స్థాయిలోను, మన దగ్గర కూడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇవి ఆర్ధికం కావొచ్చు. మరేదైనా కావొచ్చు… ఇప్పుడు దేశాల్లో అన్ని పనులు ఆగిపో యాయి. ఆర్థిక వృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. మనుషుల ప్రాణాలకన్నా ఆర్ధికం ముఖ్యకాదని బావించిన అన్ని దేశాలూ పరి శ్రమలను నిలిపివేశాయి. ఎక్స్‌పోర్టు, ఇంపోర్టులను నిలిపివేశారు.
మన దగ్గర కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. నిజానికి అగ్రదేశాలతో పోల్చుకుంటే.. మన దగ్గర ఆర్ధిక వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఒక్కరోజు ఏదైనా కారణంగా బంద్ అయితే.. లక్షల కోట్లలోనే ప్రభుత్వాలు నష్టపోతాయి. అదేసమయంలో ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా కుంటుపడుతుంది. మరి ఇప్పుడు అమల్లో ఉన్న కరోనా లాక్‌డౌన్‌లు ఎన్నాళ్లు కొనసాగుతాయో చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో కరోనా తగ్గి.. ప్రజల జీవన ప్రయాణం సాధారణ స్థితికి చేరే సరికి మళ్లీ ఎన్నాళ్లు పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్ధిక నిపుణులు వీటన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత చెబుతున్న ఏకైక మాట.. రాబోయే మూడేళ్లపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతుంది.
ఇక, భారత్ వంటి దేశాల్లో అయితే, ఇది నాలుగు నుంచి ఐదేళ్ల వరకు పడుతుందని అంటున్నారు. దీనిని తట్టుకోవడ ప్రబుత్వాలకు, ప్రజలకు కూడా కష్టమేనని అంటున్నారు. అనేక చిన్నపాటి సంస్థలు మూతబడడం ఖాయమని, బ్యాంకుల నుంచి రుణాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా ఇబ్బందేనని, దాదాపు వీటిని నిలిపి వేసే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. అంటే.. కరోనా ప్రభావం ఇప్పుడు చూస్తున్న దానికంట..కూడా అది తగ్గిన తర్వాత చూపించే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. మరి దీనిని ప్రపంచం ఎలా ఎదుర్కొంటుందో చూడాలని అంటున్నారు. నిజమే కదా!!