కొవిడ్-19 విజృంభన కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉంది. ఇదిలా ఉంటే.. చలికాలంలో కరోనా ముప్పు మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్య ని పుణులు హెచ్చరిస్తున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రత వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని వారు పేర్కొంటుండటం గమనార్హం. ఈనేపథ్యంలోనే రాబోయే కరోనా పీక్ స్టేజ్‌ను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం అందుకు తగిన నివారణ చర్యలు ప్రారంభించింది. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్నవారి కోసం ఆక్సీజన్ ను అందుబాటులో ఉంచేందుకు లక్ష మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను విదేశాల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో కరోనా బాధితులకు అవసరమయ్యే ఆక్సిజన్ విషయమై చర్చకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో తగినంత స్థాయిలో ఆక్సిజన్ ఉందని, అయితే భవిష్యత్ అవసరాలకు మరింత ఆక్సిజన్ కావాల్సి ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విదేశాల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒక రోజుకు ఏడు వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ మొత్తంలో 3,094 టన్నుల ఆక్సిజన్‌ను కరోనాతో పాటు ఇతర బాధితుల అవసరాల కోసం వినియోగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో లక్ష మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేది. దీనిలో వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను రోగులకు వినియోగించేవారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందిన తరువాత కరోనా బాధితుల కోసం ఆక్సీజన్ అవసరత మూడు రెట్లు పెరిగింది. దీంతో దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది.