ఏ పార్టీకైనా పునాదులు బలంగా పడాలంటే..అన్ని వర్గాలకు చేరువ కావాలి. అన్ని సామాజిక వర్గాలను దరి చేర్చుకోవాలి. అదే సమయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలి. అవకాశం వచ్చిన ప్రతివిషయాన్ని అందిపుచ్చుకుని ప్రజల్లోకి వెళ్లాలి. ఏ విషయం పట్టుకుంటే.. పడిపోతాం.. ఏ విషయం పట్టుకుంటే.. ప్రజల్లోకి వెళతాం.. అనే విషయాలపై క్లారిటీ అత్యంత అవసరం. అయితే, ఇప్పుడు ఘనత వహించిన కాంగ్రెస్‌లోనే ఈ తరహా వ్యూహం లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. దక్షిణాదిలో కాంగ్రెస్‌కు ఉన్న బలమైన రాష్ట్రం ఉమ్మడి ఏపీ. అయితే, తెలంగాణ విభజనతో ఆ పార్టీ పూర్తిగా జవసత్వాలు కోల్పోయింది. తెలంగాణలో ఒకింత ఫర్వాలేదనుకున్నా.. ఏపీలో మాత్రం దిక్కుదివాణం లేకుండా పోయింది.
అయితే, ఇప్పుడు కాకపోతే.. మరో నాలుగేళ్లకైనా పార్టీ పుంజుకుంటుందనే ఆశతో ఏపీలో కాంగ్రెస్ విన్యాసం చేస్తూనే ఉంది. రాష్ట్ర విభజనతో రఘువీరారెడ్డికి పగ్గాలు అప్పగించారు. అయితే, ఆయన వ్యూహాలు ఏమిటో.. పార్టీ నేతలకే అర్ధం కాలేదు, ఇక, ప్రజలకు ఏం అర్ధమవుతాయని అనుకున్నారో.. తెలియదు కానీ.. ఆయననే ఓడించారు. ఇక, గత ఏడాది ఎన్నికల్లో పార్టీ మరోసారి పరాజయం పాలవడంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శింగనమల మాజీ ఎమ్మెల్యే సాకే శైలజానాథ్‌ను అనేక అంచనాలు వేసుకుని ఏపీ కాంగ్రెస్ సారథిగా నియమించారు. పార్టీకి గతంలో వెన్నుదన్నుగా ఉన్న దళిత సామాజిక వర్గం మళ్లీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందని అధిష్టానం అంచనాలు వేసుకుని ఆయనకు ఈ పగ్గాలు ఇచ్చింది. ఇక, దీంతో పార్టీ పుంజుకోవడం ఖాయమని అనుకున్నారు.
నిజమే.. డాక్టర్ అయిన సాకే శైలజానాథ్ .. అతి పెద్ద కాంగ్రెస్‌లో వివాద రహితుడిగా వ్యవహరించారు. పైగా నిదానస్తుడు.. అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్న నాయకుడు.. కావడంతో పార్టీని పునరుజ్జీవింప చేస్తారని అనుకున్నారు. కానీ, ఆయన పగ్గాలు చేపట్టాక.. ఇప్పటి వరకు పార్టీ ముందుకు వెళ్లిన దాఖలా ఒక్కటంటే ఒక్కటి లేదు. ఆయన వేసి వ్యూహమూ కనిపించడం లేదు. పైగా ఆయన తాను పార్టీ పగ్గాలు చేపట్టాక.. వెళ్లిపోయిన సీనియర్లను తిరిగి పార్టీలోకి తీసుకువస్తానని చెప్పారు. కాని.. ఇప్పటి వరకు వచ్చిన వారు ఒక్కరు కూడా లేక పోవడంతో.. పార్టీలో నైరాశ్యం పెరిగిపోయింది.
ఇప్పుడు ఎవరిని పలకరించినా.. ఆ.. ఏముంది..? అనే నిరాశతో కూడిన నైరాశ్యమే కనిపిస్తోంది. ఇదిలావుంటే.. ఈ నైరాశ్యాన్నయినా పొగొట్టి.. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్లేలా ప్రయత్నం చేయాల్సిన శైలజానాథ్.. కేవలం ఎస్సీలపై జరుగుతున్న దాడులకు మాత్రమే స్పందిస్తున్నారు… తప్ప మిగిలిన సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడడం లేదు. అంతేకాదు, ఇటీవల దేవాలయాలపై జరిగిన దాడులను పార్టీకి అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉద్యమించే అవకాశం ఉన్నప్పటికీ.. నిమ్మకు నీరెత్తినట్టు సాకే వ్యవహరించారని పార్టీలోనే అంతర్గత చర్చ సాగుతోంది.
మరి ఈ విధమైన పసలేని విన్యాసాలతో పార్టీ ముందుకు సాగుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. మరి డాక్టర్ సాకేసార్ ఏం చెబుతారో చూడాలి. లేక.. ఆయనలో ఇంకా, తన ప్రియతమ నాయకుడు వైఎస్ కుమారుడి ప్రభుత్వం అనే ఆప్యాయత ఉందేమో.. అందుకే మాట్లాడడం లేదని కొందరు అంటున్నారు. కారణం ఏదైనా.. కాంగ్రెస్ మరింత కుదేలైందనడంలో సందేహం లేదు.
-vuyyuru subhash