భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో ప్రజలు

-

భారత్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం 9 గంటల వరకు 4067 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 292 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు 109 మంది మృతిచెందినట్టు పేర్కొంది.

అత్యధికంగా మహారాష్ట్రలో 690, తమిళనాడులో 571 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా బాధితులు ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ మొత్తం 503 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతిచెందారు. అయితే మహారాష్ట్రలో కరోనా కారణంగా 45 మంది మృతిచెందారు. ఇది దేశావ్యాప్తంగా ఉన్న మృతుల సంఖ్యలో 40 శాతంగా ఉంది.

అయితే ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ గడువు ముగియనుండటం.. మరోవైపు రోజరోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఇవే పరిస్థితులు కొనసాగితే ఎలా జీవనం సాగించాలని భయపడిపోతున్నారు. ముఖ్యంగా మర్కజ్‌ నుంచి పలు రాష్ట్రాలకు తిరిగివచ్చిన వారిలో కొందరికి సంబంధించి సరైన సమాచారం లేకపోవడం అధికార వర్గాలతోపాటు, సామాన్యులను కలవరానికి గురిచేస్తుంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు ప్రస్తుత పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో 252, తెలంగాణలో 333 కరోనా కేసులు నమోదైనట్టుగా ఆయా ప్రభుత్వాలు తెలిపాయి. తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో 297 కేసులకు మర్కజ్‌తో సంబంధం ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. ఏపీలో ఆదివారం కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో కర్నూలు జిల్లాలోనే 49 కేసులు ఉన్నాయి. దీంతో కర్నూలు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version