ప్రేమ వివాహం చేసుకున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభుకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. తన కూతురిని బెదిరించి వివాహం చేసుకున్నాడని యువతి తండ్రి వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు, ఎమ్మెల్యే ప్రభు పెళ్లి చెల్లుతుందని చెప్పింది. వధూవరులిద్దరూ మేజర్లే కాబట్టి పెళ్లికి అభ్యంతరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కొద్ది రోజుల క్రితం 19 ఏళ్ల సౌందర్యను కల్వకూర్చి ఎమ్మెల్యే ప్రభు ప్రేమ వివాహం చేసుకోవడంతో తన కూతురిని బెదిరించి వివాహం చేసుకున్నాడని యువతి తండ్రి మద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు.
ఇష్టపూర్వకంగానే ప్రభును పెళ్లి చేసుకున్నానని సౌందర్య చెప్పడంతో… యువతి తండ్రి పిల్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. కులాంతరం కావడంతో పాటు ఆ అమ్మాయి వయసు 19 ఏళ్లే కావడంతో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తన ఇంట్లోనే తన కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు ఎమ్మెల్యే. ఈ పెళ్లి సంగతి తెలుసుకున్న అమ్మాయి తండ్రి పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో ఈ పెళ్లి వ్యవహారం తమిళనాడులో చర్చనీయాంశమయింది.