క‌మ్మ అడ్డాలో బీసీ నేత టీడీపీ రాజ‌కీయం నిల‌బ‌డుతుందా..?

-

కృష్ణా జిల్లాలో కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ కమ్మ నేతల హవా ఎక్కువగా ఉంటుంది. టీడీపీ నుంచి పోటీ చేసే వారు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. ఇక గత రెండు పర్యాయాల నుంచి గన్నవరంలో కమ్మ వర్గానికి చెందిన వల్లభనేని వంశీ సాధిస్తున్నారు. గ‌తంలో కూడా ఇక్క‌డ నుంచి అదే వ‌ర్గానికి చెందిన గ‌ద్దె రామ్మోహ‌న్‌, ముసునూరు ర‌త్న‌బోస్‌, దాస‌రి బాల‌వ‌ర్థ‌న్ రావు త‌దిత‌రులు టీడీపీ, కాంగ్రెస్‌, ఇండిపెండెంట్లుగా విజ‌యం సాధించారు. ఇక టీడీపీ తరుపున పోటీ చేసిన వంశీ 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.

అయితే 2019 ఎన్నికల్లో గెలిచాక వంశీ ప్లేట్ తిప్పేశారు. వైసీపీ అధికారంలో ఉండటంతో జగన్‌కు జై కొట్టారు. దీంతో వంశీ వైసీపీ నేతగా మారిపోయారు. కాకపోతే అక్కడ ఉండే వైసీపీ నేతలతో ఆయనకు పెద్దగా పొసగడం లేదు. వంశీ రాకని దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జగన్ వీరిని ఎంత కలపాలని ప్రయత్నించినా, పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.

వైసీపీలో ఎన్ని విభేధాలు ఉన్నా ఆ పార్టీ తరుపున లీడ్ తీసుకునేది వంశీనే. నెక్స్ట్ ఎన్నికల్లో వంశీనే వైసీపీ తరుపున నిలబతారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదనే చెప్పొచ్చు. ఇక వంశీ వెళ్లిపోయాక మొన్నటివరకు టీడీపీకి దిక్కులేకుండాపోయింది. అయితే గన్నవరం స్థానానికి పలువురు నేతల పేర్లు పరిశీలించిన చంద్రబాబు, ఆఖరికి బీసీ సామాజికవర్గానికి చెందిన బచ్చుల అర్జునుడుని ఇన్‌చార్జ్‌గా పెట్టారు.

ఇంతవరకు గన్నవరంలో టీడీపీ తరుపున బీసీ నేత హవా నడిచిన సందర్భాలు లేవు. 2004లో ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు యాద‌వ్ ఇండిపెండెంట్‌గా గెలిచినా ఆయ‌న ఆ త‌ర్వాత ఆయ‌న ప్రాభావం అక్క‌డ లేదు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఉంటుంది. అలా అని ఇక్కడ బీసీ వర్గం తక్కువేమీ లేదు. బీసీ ఓట్లు ఇక్కడ ఎక్కువే. దీంతోనే బాబు అన్నీ రకాలుగా ఆలోచించి, బచ్చుల అర్జునుడుని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అయితే అర్జునుడు సొంత నియోజకవర్గం మచిలీపట్నం. మరి ఈ బీసీ నేత గన్నవరంలో వంశీకి ధీటుగా టీడీపీని ఎలా నిలబెడతారో చూడాలి.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news