అధిక బరువు ఉన్నవారికి కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. ఇటలీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ బొలొగ్నాకు చెందిన పరిశోధకులు కోవిడ్ బారిన పడ్డ 500 మంది పేషెంట్లపై అధ్యయనం చేశారు. ఈ మేరకు తేలిందేమిటంటే.. అధిక బరువు ఉన్నవారికి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
సాధారణంగా వైద్య నిపుణులు బీఎంఐ (Body Mass Index)ని బరువుకు కొలమానంగా వాడుతారు. బీఎంఐ 25 దాటిందంటే అధిక బరువు ఉన్నారని.. 30 దాటారంటే.. స్థూలకాయమని చెబుతారు. దీన్ని వయస్సు, లింగంలకు తగ్గ ఎత్తు, బరువులను ఉపయోగించి కొలుస్తారు. సాధారణంగా బీఎంఐ 25 దాటిన వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతారు. 30 దాటిందంటే.. ఆ రిస్క్ మరింత పెరుగుతుంది. ఇక ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో స్టడీ చేసిన సైంటిస్టులు.. బీఎంఐ 30 దాటిన వారికి కోవిడ్ రిస్క్ ఎక్కువని చెబుతున్నారు.
బీఎంఐ 40 దాటిఏ కోవిడ్ రిస్క్ అవకాశాలు మరింత పెరుగుతాయని సైంటిస్టులు తెలిపారు. స్థూలకాయం ఉన్నవారికి కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇక అలాంటి వారు కోవిడ్ బారిన పడితే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కూడా ఎక్కువవుతుందని అంటున్నారు. వయస్సు, లింగంతో సంబంధం లేకుండా.. బరువు ఎక్కువ ఎవరు ఉన్నా.. వారికి కోవిడ్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని వారు చెబుతున్నారు. కనుక స్థూలకాయంతో బాధపడేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.