కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో మంగళవారం (28-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఏపీలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలను పునః ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆగస్టు 31వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ నాడు – నేడు పనులు పూర్తి కావాలన్నారు.
2. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,949 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,10,297కు చేరుకుంది. ప్రస్తుతం అక్కడ 55,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 52,622 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం 1148 మంది చనిపోయారు.
3. ఏప్రిల్ 7వ తేదీన భారత్ సుమారుగా 5 టన్నుల మెడిసిన్లను ఇజ్రాయెల్‌కు పంపింది. అయితే అందుకు కృతజ్ఞతగా ఆ దేశం భారత్‌కు తాజాగా కరోనాను ఎదుర్కొనేందుకు అధునాతన వైద్య పరికరాలను అందజేసింది. ఈ క్రమంలో సదరు పరికరాలతో కూడిన ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది.
4. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్త కలిసి డెవలప్ చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను మన దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు వ్యాక్సిన్‌కు గాను ఆగస్టు చివరి వరకు ఆ కంపెనీ 3 కోట్ల డోసులను తయారు చేస్తుందని తెలుస్తుండగా.. ముందుగా వ్యాక్సిన్‌ను ముంబై, పూణె నగరాల్లో ప్రజలకు ఇవ్వనున్నారని తెలిసింది. అక్కడ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఆయా నగరాల్లో ముందుగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తారని సమాచారం.
5. కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గాక ఏపీలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆ రాష్ట్ర సీఎం జగన్ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మంగళవారం ఆయన పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో సదరు వివరాలను వెల్లడించారు.
6. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై మంగళవారం రాష్ట్ర హైకోర్టు సమీక్షించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను అన్నింటినీ అమలు చేశాక తిరిగి పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్టు 13న కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.
7. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్‌కు గాను ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌ను దేశంలో 5 చోట్ల చేపట్టనున్నారు. ఈ మేరకు సదరు వర్సిటీ, సంస్థలతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్న భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆ 5 ప్రాంతాలను ఎంపిక చేసింది. ఆయా చోట్ల ఆగస్టు చివరి వరకు ఫేజ్ 3 ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.
8. అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ మరో 3 నెలల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అక్టోబర్ వరకు వ్యాక్సిన్ పంపిణీకి అనుమతులు వస్తాయని ఆ సంస్థ భావిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు 5 కోట్ల డోసులు సిద్ధం చేస్తామని తెలిపింది.
9. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 47,704 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 654 మంది కరోనా వల్ల చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,83,157కు చేరుకుంది. మొత్తం 33,425 మరణాలు సంభవించాయి. 9,52,744 మంది కోలుకున్నారు. 4,96,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
10. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1610 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 9 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 480కి చేరుకుంది. కేసుల సంఖ్య 57,142కు చేరుకుంది. 42,909 మంది కోలుకున్నారు. 13,753 యాక్టివ్ కేసులు ఉన్నాయి.