కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో గురువారం (06-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. తెలంగాణ కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు లేఖ రాశారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్‌కు చెందిన 3 కంపెనీలు పనిచేస్తున్నాయని, త్వరలో ఇక్కడి నుంచే వ్యాక్సిన్ వస్తుందన్నారు.
2. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,328 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,96,789కి చేరుకుంది. 82,166 యాక్టివ్ కేసులు ఉండగా, 1,12,870 మంది కోలుకున్నారు. మరో 1753 మంది మృతి చెందారు.
3. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చింది. తాజాగా క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలకు ఇవ్వగా.. మంచి ఫలితాలు వచ్చాయి. ఎలుకలకు వ్యాక్సిన్‌ను ఇవ్వగా వాటి ఊపిరితిత్తులు, ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్ పూర్తి తగ్గిందని పరిశోధకులు గుర్తించారు.
4. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, మార్కెటింగ్ కోసం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో నోవావాక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ చివరి వారంలో ఆ సంస్థ తమ వ్యాక్సిన్‌కు ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ చేపట్టనుంది.
5. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2092 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,050కి చేరుకుంది. 20,358 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. 52,103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 13,793 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. మొత్తం 589 మంది చనిపోయారు.
6. కరోనా బాధితులపై ప్లాస్మా థెరపీ విధానం పెద్దగా ప్రభావం చూపించడం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ప్లాస్మా చికిత్స ఫలితాలను అంచనా వేసేందుకు 15 మంది కోవిడ్ రోగులతో కూడిన రెండు గ్రూపులపై సైంటిస్టులు పరిశోధనలు చేశారన్నారు.
7. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారిని భారత్‌కు తీసుకువచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ వల్ల ఇప్పటి వరకు 9.50 లక్షల మంది స్వదేశానికి వచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం 5వ విడుతలో భాగంగా మరింత మందిని విదేశాల నుంచి భారత్‌కు తీసుకువస్తున్నట్లు తెలిపింది.
8. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,514 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,79,779కు చేరుకుంది. మొత్తం 16,792 మంది చనిపోయారు. 3,16,375 మంది కోలుకోగా, 1,46,305 మంది చికిత్స పొందుతున్నారు.
9. కరోనాపై తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలేనని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కేబినెట్ సమావేశంలో అసలు ప్రాధాన్యత ఉన్న అంశాలను పట్టించుకోలేదని అన్నారు.
10. ఏపీలో కరోనా చికిత్సకు గాను నెలకు రూ.350 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దన్నారు. కరోనా రోగులకు అరగంటలో బెడ్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.