కరోనా మొదటి వేవ్ వల్ల 60 ఏళ్లకు పైబడిన వారు ఎక్కువగా ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా రెండో వేవ్ లో యువత ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇక మూడో వేవ్‌లో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని, వారికి అప్పుడు ఎక్కువగా కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల వారి తల్లిదండ్రులకు ఇప్పటి నుంచే టీకాలను వేయించాలని నారాయణ హెల్త్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ దేవి శెట్టి అన్నారు.
కరోనా మూడో వేవ్ లో పిల్లలు ఎక్కువగా కోవిడ్ బారిన పడే అవకాశ ఉంది కనుక వారి తల్లిదండ్రులకు ఎక్కువగా టీకాలను వేయించాలి. అలాగే దేశంలో 12 ఏళ్ల వయస్సు కన్నా తక్కువగా ఉన్న చిన్నారులు 165 మిలియన్ల మంది ఉన్నారు, వారిలో కనీసం 20 శాతం మంది కోవిడ్ బారిన పడతారు, 5 శాతం మందికి ఐసీయూలో చికిత్స అందించాల్సి వస్తుంది. కానీ మన దేశంలో 90వేల ఐసీయూ బెడ్స్ పెద్దలకు ఉన్నాయి, పిల్లలకు 2వేల బెడ్స్ మాత్రమే ఉన్నాయని అన్నారు. అందువల్ల వైద్య సదుపాయాలను ఇప్పటి నుంచే ఏర్పాటు చేయాలన్నారు.
మన దేశంలో పీడియాట్రిక్ కోవిడ్ కేర్ వార్డులు లేవని, చిన్నపిల్లలకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లేవని, కనుక ఆయా సదుపాయాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని డాక్టర్ దేవి శెట్టి అన్నారు. అక్టోబర్-డిసెంబర్ నడుమ కోవిడ్ మూడో వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున దేశంలో కనీసం 300 మిలియన్ల మంది యువ తల్లిదండ్రులకు టీకాలను వేయాలని, దీంతో పిల్లలను కోవిడ్ నుంచి రక్షించవచ్చని అన్నారు.