కరోనా మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ ఎంత భీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఓ దశలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 4వేల మందికి పైగా మరణించారు. అయితే కోవిడ్ రెండో వేవ్ కన్నా మూడో వేవ్ మరింత దారుణంగా ఉంటుందని ఎస్‌బీఐ రిపోర్టులో వెల్లడైంది. అయితే ముందుగా సిద్ధమై ప్రణాళికలను అమలు చేస్తే కోవిడ్ మూడో వేవ్‌లో మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది.
ఎస్‌బీఐ బయట పెట్టిన ఎకోవ్రాప్ నివేదిక ప్రకారం.. కోవిడ్ మూడో వేవ్ ప్రభావం 98 రోజుల పాటు ఉంటుందని వెల్లడైంది. కోవిడ్ రెండో వేవ్ కన్నా మూడో వేవ్‌లో ఇంకా ఎక్కువ కేసులు నమోదు అయ్యేందుకు అవకాశం ఉందని తేలింది. కోవిడ్ మూడో వేవ్‌కు అందరూ సిద్ధం అయితే కేసుల సంఖ్యతోపాటు మరణాలను కూడా తగ్గించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
కోవిడ్ మూడో వేవ్‌లో చిన్నారులకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కనుక వారిని రక్షించుకోవాలని అన్నారు. దేశంలో 12-18 ఏళ్ల వయస్సు ఉన్నవారు 15-17 కోట్ల మంది ఉన్నారని, వారిని కోవిడ్ బారి నుంచి సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఇక ఇప్పటికే కోవిడ్ మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఐసీయూ బెడ్లను, ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.