దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. రేపు కేంద్రం రాష్ట్రాలతో సమీక్ష

-

రోజు రోజుకు మన దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. ప్రతి రోజు కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ రేపు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మంత్రులకు కొవిడ్‌ కట్టడిపై మార్గనిర్దేశనం చేయనున్నారు. నిన్న ఎంపవర్‌మెంట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సైతం సమావేశమైంది. నీతి ఆయోగ్‌ (హెల్త్‌) సభ్యుడు డాక్టర్ వీకే పాల్, ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్ రాజీవ్ బహల్, ఇతర సీనియర్ ఆరోగ్య అధికారులు సమావేశం లో పాల్గొన్నారు.

రేపు మన్సుఖ్‌ మాండవీయ సమక్షం లో జరిగే ఈ సమావేశానికి ఇండియన్‌ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం సైతం పాల్గొననుంది. దేశంలో కొవిడ్‌ పరిస్థితి, సంసిద్ధతపై చర్చించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం దేశంలో కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కారణమని భావిస్తున్నారు. కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,335 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు 20శాతం కొత్త కేసులు పెరిగాయి. గత ఆరు నెలల్లో అత్యధికంగా కేసులు నమోదవడం ఇదేతొలిసారి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.32 శాతంగా ఉన్నదని వెల్లడించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version