యావత్తు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి భయాందోళనలకు గురి చేసింది.. ఇప్పటికీ చేస్తోంది కూడా.. అయితే.. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి టీకాలను తీసుకువచ్చారు. అయితే.. ఇప్పటివరకు ఇంజక్షన్ విధానంలో టీకాను ప్రజలకు పంపిణీ చేశారు. అయితే ఇప్ప్పుడు టాబ్లెట్ రూపంలో కోవిడ్ టీకాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా అభివృద్ధి చేసిన ఈ టీకాను నోటీ ద్వారా తీసుకోవచ్చని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.
రక్తంలోను, ఊపిరితిత్తుల్లోనూ ఇది యాంటీబాడీలను సమర్థంగా తయారుచేస్తుందని.. ఫలితంగా కరోనా వైరస్ నుంచి అది రక్షణ కల్పిస్తుందని పరిశోధకులు వివరించారు. అంతేకాదు, ఇంజక్షన్ ద్వారా తీసుకునే టీకాతో పోలిస్తే ఈ నోటి టీకా ‘ఇమ్యునోగ్లోబ్యులిన్-ఎ (ఐజీ-ఎ)ను అధికంగా ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్ల నుంచి వెలువడే వైరస్ కణాల సంఖ్యను తగ్గించడంలో ఐజీ-ఎ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.