కరోనా సెకండ్ వేవ్ లో ఇండియా తీవ్రంగా నష్టపోయింది. అధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడంతో పాటు.. మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. దీంతో పలు రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ లోకి వెళ్లాయి. అయితే సెకండ్ వేవ్ ప్రబలుతున్న దశలో డెల్టా వేరియంట్ కరోనా కేసులే ఎక్కువగా నమోదయ్యాయి. కాగా సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ రెండో వేవ్ సమయంలోనూ ప్రభావవంతంగా పనిచేసినట్లు తేలింది.
అయితే రెండో దశ సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్ పై సమర్థవంతంగా పనిచేసినట్లు లాన్సెట్ జర్నల్ ఓ నివేదికలో తెలిపింది. మధ్య స్థాయి నుంచి తీవ్ర స్థాయి కోవిడ్ లక్షణాలు ఉన్న వారి పట్ల కోవీషీల్డ్ మెరుగ్గా పనిచేసినట్లు ఆ స్టడీలో తేల్చారు. సెకండ్ వేవ్ సమయంలో ఇండియాలో ఎక్కువ కేసులు నమోదవుతున్న వేళ ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందనే అధ్యయనం చేశారు. కొవిడ్ బారినపడిన 2,379 మందితో పాటు కరోనా నుంచి కోలుకున్న 1,981 మందిపై ఈ పరిశోధన జరిపినట్లు పేర్కొన్నారు. రెండు డోసులు తీసుకున్న వారిలో కోవిషీల్డ్ 63 శాతం సమర్థతను కలిగి ఉందని తేలింది. ఇక మధ్యస్థాయి నుంచి తీవ్ర స్థాయి వ్యాధి ఉన్నప్పుడు వ్యాక్సిన్ సమర్ధత 81 శాతంగా ఉన్నట్లు లాన్సెట్ తన రిపోర్ట్‌లో తెలిపింది.