కోదండరామ్ పై పాత పగ తీర్చుకుంటున్న సీపీఐ…!

-

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ట్విస్ట్‌లు ఉంటాయి. కోదండరామ్‌కు CPI రాం రాం చెప్పడం కూడా అదేనని అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమాల్లో కలిసి పనిచేశారు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కోదండరామ్‌ ప్రజా కూటమిలో చేరడానికి ప్రధాన కారణం CPI. ఆ కూటమిలో టీడీపీ ఉన్నా.. విమర్శలు వస్తాయని తెలిసినా CPI చేసిన ప్రతిపాదనను కాదనలేకపోయారు కోదండరామ్‌.

అలాంటి CPI ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్‌కు హ్యాండిచ్చింది. దీనిపై పార్టీలో కూడా చర్చ జరిగిందట. ఉద్యమంలో కలిసి పనిచేసినప్పుడు.. ఎన్నికల్లో దూరంగా ఎందుకు ఉండాలని సీనియర్‌ నాయకుడు నారాయణ పార్టీ నేతలను ప్రశ్నించారట. హైదరాబాద్‌- రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు మద్దతు పలికి.. ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు మద్దతిస్తే వ్యూహం సరిగ్గా సరిపోయేది కదా అని ఆయన సూచించారట. కానీ.. ఈ సూచనకు CPI తెలంగాణ నాయకత్వం నో చెప్పి సొంత అభ్యర్థిని బరిలో నిలిపింది.

అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో CPIపోటీ చేసినచోట కోదండరామ్‌ పార్టీ బరిలో నిలబడినందున.. దానికి ప్రతీకారంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతంగా అభ్యర్థిని దించామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో మిగిలిన రాజకీయ పార్టీలకు.. CPIకి తేడా ఏంటనే చర్చ మొదలైందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇస్తారో ఆఖరి వరకూ తేల్చకుండా మోసం చేసిన కాంగ్రెస్‌తో కలవబోమని CPI చెప్పేసింది. మొత్తానికి ముందస్తు ఎన్నికల్లో CPI మాట విని నష్టపోయిన కోదండరామ్‌కు.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బపడిందనే టాక్‌ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version