హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అన్న పై తమ్ముడు కుక్కర్ తో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అన్న మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే…. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దుండిగల్ మున్సిపల్ పరిధి చర్చి గాగిల్లాపూర్ కు చెందిన భరత్ భూషణ్ 35 సాయి తేజ 28 అన్నదమ్ములు. వీరిద్దరూ ఇంటి వద్ద ఖాళీగానే ఉంటున్నారు. తల్లికి పక్షవాతం రావడంతో ఆమె మంచానికే పరిమితం అయ్యారు. అయితే అన్నదమ్ములిద్దరూ ప్రతిరోజు తాగి గొడవ పడుతూ ఉంటారు.
ఈ క్రమంలో ఈనెల 24వ తేదీన రాత్రి కూడా ఇద్దరు తాగి గొడవ పడ్డారు. దాంతో కోపంతో రగిలిపోయిన తమ్ముడు సాయి తేజ అన్న భరత్ భూషణ్ పై కుక్కర్ తో దాడి చేశాడు. ఈ దాడిలో భరత్ భూషణ్ స్పృహ తప్పి పడిపోయాడు. రాత్రి అన్న పై దాడి చేసిన తమ్ముడు ఆ తర్వాత వెళ్లి పడుకున్నాడు. ఉదయం అన్నను లేపడానికి ప్రయత్నించగా అతడు చనిపోయినట్టు గుర్తించాడు. దాంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.