9 మంది ఆల్‌ఖ‌యిదా అనుచరుల అరెస్టు

ఉగ్ర‌వాద సంస్థ‌ ఆల్ ఖ‌యిదాకు చెందిన 9 మంది అనుచ‌రుల‌ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం‌లోని ముర్సీదాబాద్‌తో పాటు కేర‌ళ‌లోని ఎర్నాకుళం నుంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. రెండు చోట్ల ఎన్ఐఏ అధికారులు ఈరోజు సోదాలు నిర్వ‌హించి వారిని అరెస్టు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఆల్ ఖ‌యిదా ఉగ్ర‌వాదులు సోష‌ల్ మీడియా ద్వారా భార‌త్‌లోని వారిని ప్రేరేపించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో దాడుల‌కు పాల్ప‌డే విధంగా రెచ్చ‌గొట్టిన‌ట్లు ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ఆల్ ఖ‌యిదా మ‌ద్ద‌తుదారులు నిధుల స‌మీక‌ర‌ణ కోసం విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు కొనేందుకు కొంద‌రు ఢిల్లీకి కూడా వెళ్లేందుకు ప్లాన్ వేసిన‌ట్లు తేలింది.

ఈ క్ర‌మంలోనే ఆల్ ఖ‌యిదా అనుచ‌రుల‌ను అరెస్టు చేసి, ఉగ్ర‌దాడుల‌ను నివారించిన‌ట్లు ఎన్ఐఏ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి నిషేధిత వ‌స్తువులు, డాక్యుమెంట్లు, డిజిట‌ల్ డివైస్‌లు, ఆయుధాలు, దేశీయ పిస్తోళ్లు, బాడీ ఆర్మ‌ర్‌ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఎన్ఐఏ చెప్పింది. నాటు పేలుడు ప‌దార్థాల‌ను కూడా సీజ్ చేసిన‌ట్లు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారం ఇంకా అందాల్సి ఉంది.