కల్తీ మద్యం ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. మద్య నిషేధం విధించినా ఈ దందా ఆగడం లేదు. అమాయకుల ప్రాణాలు నిలవడం లేదు. తాజాగా మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. చప్రా జిల్లాలో కల్తీ మద్యం సేవించి 50 మందికి పైగా మరణించిన ఘటన మరవకముందే సివన్ జిల్లాలోని భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు మరణించారు.
2016 ఏప్రిల్‌లో నితీశ్ కుమార్ సర్కార్ బిహార్‌లో మద్యం తయారీ, విక్రయాలను నిషేధించింది. రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి పలువురు మరణిస్తున్న ఘటనలపై నితీశ్ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు చప్రా కల్తీ మద్యం వ్యవహారంలో ప్రత్యక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ నమోదైంది.
బిహార్‌లో మద్యం తయారీ, విక్రయం, అక్రమ మద్యం నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని పిటిషన్ డిమాండ్ చేసింది. ఇక కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ప్రతినిధులు నేడు గవర్నర్ పగు చౌహాన్‌ను కలవనున్నారు.