మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఆదివాసిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన హల్‌చల్ చేసింది. అది మరువక ముందే.. మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు వీళ్లకు ఏం అయింది. మనుషులు అన్న కనీసం జ్ఞానం లేకుండా తయారవుతున్నారు. మానవత్వం మాటేలేదు. యువకుడిని తన కాళ్లు నొక్కాలని ఓ వ్యక్తి చితకబాదాడు. అంతటితో ఆగకుండా తన కాళ్లు నాకాలంటూ చిత్రహింసలు చేసి చివరికి యువకుడితో కాళ్లు నాకించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని కొంత మంది యువకులు కారులో వెళ్లి కిడ్నాప్ చేశారు. కారులో ఎక్కించుకున్న యువకుడిని చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా కారులోకి ఎక్కించుకుని కదులుతున్న కారులోనే అతనిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ యువకుడి ముఖంపై చెప్పులతో కొట్టారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, పిడిగుద్దులతో యువకుడిని చిత్రహింసలు పెట్టారు. ఆపై ఆ యువకుడితో తమ కాళ్లు నాకించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలను ఆ కారులోనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన జూన్ 30న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, నిందితులు అందరూ గ్వాలియర్ జిల్లాలోని దబ్రా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటన తర్వాత బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఇద్దర్ని అరెస్ట్ చేశామని..పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టినట్లు వివరించారు. అయితే సంబంధిత యువకుడిపై నిందితులు ఎందుకు దాడి చేశారన్నది మాత్రం పోలీసులు చెప్పడం లేదు.
ఇటీవలే మూత్రవిసర్జన కలకలం…
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఇటీవల ఓ ఆదివాసిపై బీజేపీ నేత అనుచరుడు మూత్ర విసర్జన చేసిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసి.. ఇంటిని కూల్చి వేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. బాధితుడిని తన నివాసానికి ఆహ్వానించి ఆ ఆదివాసీ యువకుడికి క్షమాపణలు చెప్పారు. ఆదివాసీ యువకుడి కాళ్లు కడిగి ఆ నీటిని తలపై చల్లుకున్నారు. మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఘటనలు తీవ్ర సంచలనంగా మారాయి.