అమెరికా వెళ్దాం అని అప్పులు చేయించాడు…కట్‌ చేస్తే డబ్బు తీసుకుని ఫోన్‌ స్విచ్ఛ్ ఆఫ్‌…

-

మోసం చేసేవాళ్లు తెలివిమీరుతున్నారా..? లేక మోసపోయే వాళ్లు మరీ అమాయకంగా తయరవుతున్నారా తెలియడం లేదు కానీ.. ఈ మధ్య చాలామంది దారణంగా మోసపోతున్నారు. వీటికి ప్రధాన కారణం..అవతలి వ్యక్తిని గుడ్డిగా నమ్మడమే.. వాళ్ల మాయలో పడి వాళ్లు ఏం చెప్పినా నిజమే అనుకోని చేస్తున్నారు. మన నీడను కూడా మనం నమ్మడానికి లేని ఈ రోజుల్లో అవతలి వ్యక్తిగా అంత బలంగా ఎలా నమ్మగలుగుతున్నారు..?తాజాగా విజయవాడకు చెందిన ఓ యువతి ఘరానా మోసగాడి చేతిలో దారుణంగా మోసపోయింది. కోటి రూపాయల వరకూ పోగొట్టుకుంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

స్థానిక దేవీనగర్‌కు చెందిన యువతి ఎం.టెక్‌. చదివి ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తుంది.. వివాహం కోసం ఆమె తన ప్రొఫైల్‌ని పెళ్లి వెబ్‌సైట్లో ఉంచింది.. 2022, ఏప్రిల్‌ 19న కె.శ్రీకాంత్‌ అనే యువకుడు ఆమెకు ఫోన్‌ చేసి వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపారు. తన కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో ఉంటున్నారని చెప్పాడు. తాను ఆస్ట్రాజెనికా ఫార్మా కంపెనీలో పని చేస్తున్నానాను అన్నాడు. ప్రాజెక్టు నిమిత్తం అమెరికా వెళుతున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటున్నాం కనుక అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. పాస్‌పోర్టు, వీసా తీసుకోవాలి అందుకోసం సిబిల్‌ స్కోర్‌ 842 పాయింట్ల వరకు ఉండాలని నమ్మబలికాడు..

శ్రీకాంత్‌ మాయ మాటలు నమ్మిన యువతి క్రెడిట్‌ కార్డులు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థల నుంచి విచ్చలవిడిగా రుణాలు తీసుకుంది. తనతో పాటు సోదరుడు, తండ్రితో కూడా రుణాల కోసం పలు సంస్థల వద్ద దరఖాస్తు చేయించింది.. అలా వచ్చిన రూ.1,06,39,000ను శ్రీకాంత్‌ చెప్పిన హరీష్‌ సంపంగి అనే వ్యక్తి ఖాతాలకు పంపించారు. ఆ తరువాత నుంచి శ్రీకాంత్‌ వారి ఫోన్లకు సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేశాడు.

2022, సెప్టెంబరు 3న తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెల్‌ పోలీసులు యువతికి ఫోన్‌ చేసి శ్రీకాంత్‌ గురించి ఆరా తీశారు. అతడు ఒక మోసగాడని వారు చెప్పడంతో ఆమె కంగుతిన్నారు. వెంటనే విజయవాడ సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు కూడా ఇప్పుడు అతని కోసం గాలిస్తున్నారు. ఇక్కడ తప్పు శ్రీకాంత్‌ది ఎంతుందో..ఆ యువతిది కూడా అంతే ఉంది. ముక్కూ మొఖం తెలియని వ్యక్తి చెప్పిన మాటలను అలా గుడ్డిగా నమ్మి ఏకంగా అంత మొత్తం లోన్‌ తీసుకోవచ్చునా..? లోన్‌ తీసుకున్న డబ్బును అలా ఇంకొకరికి పంపించవచ్చునా..? అదేంటో కానీ.. సైబర్‌ మోసాలకు బాగా చదువుకున్న వాళ్లే బలైపోతున్నారు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version