గుజరాత్ తీరంలో పాకిస్థాన్ కు చెందిన ఓ నౌక హల్ చల్ సృష్టించింది. ఆ నౌకలో 600 కోట్ల విలువై డ్రగ్స్ ఉన్నాయి. 200 కిలోల హెరాయిన్ ను తరలిస్తుండగా… భారత కోస్ట్ గార్డ్ ఆ నౌకను సీజ్ చేసింది. పాకిస్థాన్ కు చెందిన ఆ నౌకలో భారీ ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్నట్టు ముందుగా డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది.
దీంతో వెంటనే వాళ్లు కోస్ట్ గార్డ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సంయుక్త ఆపరేషన్ నిర్వహించి.. ఆ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నౌకలో చెక్ చేయగా.. 200 కిలోల హెరాయిన్ అందులో ఉన్నట్టు తెలిసింది. దానికి విలువ సుమారు 600 కోట్ల రూపాయిలు ఉంటుందని అధికారులు తెలిపారు. హెరాయిన్ తో పాటు నౌకలో ఉన్న ఆరుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఆ నౌకను పాకిస్థాన్ లోని కరాచీలో రిజిస్టర్ చేసినట్టు గుర్తించారు. దాని పేరు అల్ మదీనా. అయితే.. అసలు.. అంత పెద్ద మొత్తంలో హెరాయిన్ ను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు.. అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.