భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యవసర సేవల నిమిత్తం సేవలందించే ప్రభుత్వ వాహనాన్నే దొంగలు అపహరించారు. మెకానిక్నంటూ నమ్మబలికి మరమ్మతులు చేస్తామంటూ వాహనంతో ఉడాయించారు. పోలీసులు అప్రమత్తం అవడంతో వాహనం అక్కడే వదిలేసి పరారయ్యాడు ఆ దొంగ. వాహనం మరమ్మతుల డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనతో పోలీస్ శాఖ షాక్ కు గురి అయ్యింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల అమ్మఒడి వాహనాన్ని సోమవారం మధ్యాహ్నం దొంగలు అపహరించారు. తాను మెకానిక్నని.. అత్యవసర సేవలందించే ప్రభుత్వ వాహనాలను రిపేర్ చేస్తుంటానని నమ్మబలికాడు. అనంతరం వాహనాన్ని ట్రయల్ వేయాల్సి ఉంటుందని చెప్పడంతో నమ్మిన డ్రైవర్ దొంగ చేతిలో తాళాన్ని పెట్టాడు. ఇక అంతే ట్రయల్ వేస్తానని చెప్పిన సదరు వ్యక్తి ఎంతకీ తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీసులను డ్రైవర్ సంప్రదించాడు. అప్రమత్తమైన పోలీసులు సమీప పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం చేరవేశారు. ఇల్లందు, మహబూబాబాద్ రహదారి గుండా 102 వాహనం వెళ్లడాన్ని గమనించిన పోలీసులు… దొంగలను వెంబడించారు. ఈ క్రమంలో ఇల్లందు మండలం రొంపెడు వద్ద పోలీసుల రాకను పసిగట్టిన దొంగ, వాహనాన్ని అక్కడే రహదారిపైనే వదిలి ఉడాయించాడు. ఈ వాహనం రెండు నెలల క్రితం రిపేరుకు వచ్చిన సందర్భంలో మరమ్మతులు చేసినా కూడా డబ్బులు ఇవ్వకుండా తిప్పుతుండటం వల్ల విసిగిపోయిన మెకానిక్ వాహనం ఎత్తుకెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోనసాగిస్తున్నారు.