దండుపాళ్యం సినిమా ప్రేర‌ణ‌తో అత్యాచారాలు.. పోలీసుల అదుపులో సైకో కిల్ల‌ర్‌..

-

సినిమాలు మ‌న‌కు కేవ‌లం వినోదాన్ని మాత్ర‌మే పంచుతాయి. వాటిని చూసి వ‌దిలేయాలి. అంతేకానీ వాటిల్లో చూపించే సంఘ‌ట‌న‌ల‌ను ప్రేర‌ణ‌గా తీసుకోకూడ‌దు. ఒక‌వేళ మంచి అయితే ఫ‌ర్వాలేదు. కానీ సినిమాల్లో చూపించే చెడును మాత్రం అనుక‌రించ‌కూడ‌దు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ.. ప్ర‌స్తుతం మ‌న స‌మాజంలో కొందరు ప్ర‌బుద్ధులు సినిమాల‌లో చూపించే చెడు సంఘ‌ట‌న‌ల‌నే ప్రేర‌ణ‌గా తీసుకుని చేయ‌కూడ‌ని నేరాలు చేస్తున్నారు. తాజాగా ఏపీలోని ప‌శ్చిమ గోదావరి జిల్లా కామ‌వ‌ర‌పు కోట మండ‌లం గుంటుప‌ల్లి (జీల‌క‌ర్ర‌గూడెం) బౌద్ధారామాల వ‌ద్ద ఈ నెల 24వ తేదీన ఓ యువ‌తిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌నే ఇందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. ఈ కేసులో నిందితుడు ఓ సినిమాను చూసి అందులో ఉన్న సీన్ల‌ను ప్రేర‌ణ‌గా తీసుకుని యువ‌తులపై అత్యాచారం చేస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల్లోకి వెళితే…

ద్వార‌కా తిరుమ‌ల మండ‌లం జి.కొత్త‌ప‌ల్లి గ్రామానికి చెందిన యువ‌తిని పెళ్లి చేసుకున్న రాజు అనే వ్య‌క్తి త‌న అత్త‌వారింట్లోనే కాపురం పెట్టాడు. అక్క‌డే జీడితోట‌ల‌కు కాప‌లా ఉంటూ స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో సంచ‌రించే జంతువులు, ప‌క్షుల‌ను అత‌ను వేటాడేవాడు. అలాగే అట‌వీ ప్రాంతం కావ‌డంతో అక్క‌డికి వ‌చ్చే ప్రేమ జంట‌ల‌ను బెదిరించి రాజు డ‌బ్బులు వ‌సూలు చేసేవాడు. ఈ క్ర‌మంలోనే అత‌నికి ఎవ‌రైనా అమ్మాయి అందంగా క‌న‌బ‌డితే చాలు.. వారిపై అత్యాచారం చేసేవాడు. ఇక కొంద‌రినైతే అత‌ను అత్యాచారం చేశాక అతి కిరాత‌కంగా చంపేవాడు. కాగా ఈ నెల 24వ తేదీన బౌద్ధారామాల వ‌ద్ద‌కు వ‌చ్చిన ధ‌ర‌ణి అనే యువ‌తిపై రాజు అత్యాచారానికి పాల్పడి ఆమెను దారుణంగా చంపేశాడు. ఆమెతో వ‌చ్చిన యువ‌కుడిపై రాజు దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచాడు.

అయితే ధ‌ర‌ణిని హ‌త్య చేశాక ఆమె ఫోన్‌ను తీసుకుని అందులో ఆమె సిమ్ తీసేసి త‌న సిమ్ వేసుకుని రాజు ఆ ఫోన్‌ను వాడ‌డం మొద‌లు పెట్టాడు. ఈ క్ర‌మంలో పోలీసులు టెక్నాల‌జీ స‌హాయంతో రాజును క‌నిపెట్టి అదుపులోకి తీసుకుని త‌మ‌దైన శైలిలో విచారించ‌గా.. అత‌ను త‌న బండారాన్ని బ‌య‌ట పెట్టాడు. ధ‌ర‌ణి మాత్ర‌మే కాదు, గ‌తంలో అత‌ను 14 మంది యువ‌తుల‌పై అత్యాచారాలు చేశాన‌ని, వారిలో న‌లుగురిని చంపేశాన‌ని రాజు పోలీసుల విచార‌ణ‌లో అంగీక‌రించాడు. దీంతో పోలీసులు రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

అయితే రాజును విచార‌ణ చేసిన పోలీసుల‌కు మ‌రొక షాకింగ్ విష‌యం తెలిసింది. అదేమిటంటే… దండుపాళ్యం అనే సినిమా గుర్తుంది క‌దా. అనేక భాగాలుగా రిలీజైంది. అందులో అన్నీ అస‌భ్య‌క‌ర‌మైన దృశ్యాలే ఉంటాయి. అయితే ఆ సినిమాల‌ను ప్రేర‌ణ‌గా తీసుకునే అమ్మాయిల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు చేశాన‌ని రాజు చెప్ప‌డంతో పోలీసులు అవాక్క‌య్యారు. కాగా పోలీసులు ఈ మేర‌కు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. రాజు చేతిలో అత్యాచారానికి గురైన‌, చంప‌బ‌డ్డ అమ్మాయిల వివ‌రాల‌ను వారు సేక‌రిస్తున్నారు. అయితే అన్ని నేరాలు చేసినా రాజుపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోదు కాక‌పోవ‌డం పోలీసుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version