సంక్రాంతి వచ్చింది తుమ్మెదా… సరదాలు తెచ్చింది తుమ్మెద అంటూ నగర వాసులంతా పల్లెల బాట పడుతుంటే దొంగలు మాత్రం తాళం వేసి ఉన్న ఇళ్లను ఊడ్చేస్తున్నారు. అవును.. ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ లేదు.. జనాలు కూడా లేరు. అంతా సంక్రాంతి కోసం తమ ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో తాళం వేసి ఉన్న ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఉన్నదంతా ఊడ్చుకుపోతున్నారు. ఈ దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లోని వనస్థలిపురంలో, హయత్ నగర్ లో దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లలో పట్టపగలే చోరీ చేశారు.
ఈ సంక్రాంతి దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వీళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నప్పటికీ.. ఎటువంటి ఆధారం దొరకకుండా వీళ్లు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. పోలీసులు సంక్రాంతి దొంగలను పట్టుకోవడం కోసం గల్లీ గల్లీలో గస్తీ పెట్టినా… పెట్రోలింగ్ మొబైల్స్ పెంచినా.. ఏం చేసినా.. దొంగతనాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు మాత్రం ఆగడం లేదు. అందుకే.. ఊళ్లకు వెళ్లే ముందు పోలీసులకు చెప్పి వెళ్లాలంటూ ప్రజలను పోలీసులు కోరుతున్నారు.