భార్యాభర్తల బంధం అనేది చాలా గట్టి బంధం. చిన్న చిన్న విషయాలకు తెగిపోయేది కాదది. ఒకసారి అమ్మాయి మెడలో తాళి పడ్డాక.. జీవితాంతం కష్టసుఖాల్లో వాళ్లిద్దరూ పాలుపంచుకోవాల్సిందే. అంతటి మహత్తు ఉంటుంది తాళికి. అందుకే.. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని అంటుంటారు పెద్దలు. భార్య భర్తకు.. భర్త భార్యకు గౌరవం ఇవ్వాలి.. వాళ్లిద్దరి మధ్య ఏం దాపరికాలు ఉండకూడదు. ఇద్దరి మధ్యా మనస్పర్థలు కూడా ఉండకూడదు. ఒకరంటే మరొకిరి ప్రేమ, అనురాగం ఉండాలి. అదే భార్యాభర్తల బంధం.
అయితే.. ఓ మహిళ మాత్రం భార్యాభర్తల బంధానికే చెడ్డ పేరు తెచ్చింది. కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఎందుకు చంపిదో తెలుసా? ఎల్ఐసీ డబ్బుల కోసం… ప్రభుత్వ ఉద్యోగం కోసం. లోపలి నుంచి కోపం టన్నుల కొద్దీ బయటికి వస్తున్నాదా? దాన్ని అలాగే ఆపుకొని ముందు ఈ వార్త చదవండి.
అన్నట్టు ఈ ఘటన ఎక్కడో జరగలేదు. మన రాష్ట్రంలోనే.. మన హైదరాబాద్ లోనే.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురం ఏసీపీ ఈ కేసు గురించి ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే విందాం.
పోస్టల్ లో ఉద్యోగం చేస్తున్నాడు కేస్యా నాయక్. వయసు 42 ఏళ్లు. 20 ఏళ్ల కిందనే పెళ్లి అయింది. కాకపోతే కేస్యాకు పిల్లలు కలుగలేదు. తన భార్య పద్మకు పిల్లలు కలుగటం లేదని.. కేస్యా శైలజ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య పద్మకు, కేస్యాకు మధ్య గొడవలు మొదలయ్యాయి.
భర్తపై కేసు కూడా పెట్టింది. అలా భర్తపై కోపం పెంచుకుంది పద్మ. భర్తను చంపేస్తే అతడి ఉద్యోగం, ఎల్ఐసీ డబ్బులు తనకే వస్తాయని అనుకుంది. అనుకున్నదే తడువుగా ఓ ప్లాన్ వేసింది. కేస్యా డ్రైవర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. తన భర్తను చంపేస్తే 10 లక్షలు ఇస్తానని ఆశ చూపింది. 15 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది.
దీంతో ఆగస్టు 31న కేస్యాను చంపడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం.. వినోద్ కేస్యాను ఓ బార్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి ఫుల్లుగా మద్యం తాగారు. రాత్రి 12.30 వరకు మద్యం తాగిన తర్వాత ఇంటికి బయలుదేరారు. కొద్ది దూరం వచ్చిన తర్వాత కారులో నిద్రపోతున్న కేస్యాను వినోద్ గొంతు నులిమి చంపేశాడు.
అయితే.. కేస్యా మరణం హత్య కాకుండా ప్రమాదంలా చిత్రీకరించాలని వినోద్ ప్లాన్ చేశాడు. దీంతో కేస్యాను చంపిన తర్వాత కారును స్పీడ్ గా తీసుకెళ్లాడు వినోద్. అనంతరం ఓ స్తంభానికి ఢీకొట్టాడు. యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న స్థానికులు కేస్యాను ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే కేస్యా చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. కేస్యాపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో కారును డ్రైవ్ చేసిన వినోద్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో అసలు విషయం బయటికి వచ్చింది. దీంతో గూడుపుఠాని నడిపిన పద్మను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అలా భర్త ప్రభుత్వ ఉద్యోగం, ఎల్ఐసీ డబ్బుల కోసం ఆశ పడి అటు భర్తను పోగొట్టుకొని.. ఇటు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది పద్మకు. అయితే.. వినోద్, పద్మ మధ్య ఉన్న సంబంధం తదితర విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.