దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన ఈ హత్య మీద కీలక అంశాలు వెల్లడించారు. బాలుడ్ని కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపి హైటెక్ పద్దతిలో టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేసిన మంద సాగర్ ను అరెస్ట్ చేసి అతని సెల్ ఫోన్, బైక్ ని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 18 సాయంత్రం 5.30 గంటల సమయంలో సాగర్ పధకం ప్రకారం AP36 Q8108 అనే ఫేక్ నెంబర్ వేసుకున్న బైక్ పై దీక్షిత్ ను తీసుకు వెళ్ళాడని ఆయన వివరించారు.
సీసీ కెమెరాలకు దొరకకుండా దనమయ్య గుట్ట వైపు నుండి బాబుని తీసుకు వెళ్లినట్టు గుర్తించారు. అలానే దీక్షిత్ ఏడవడం మొదలు పెట్టిన్నప్పుడు దీక్షిత్ కు మత్తు టాబ్లెట్ ఇచ్చి కర్చీఫ్ తో చేతులు కట్టినట్టు ఆయన వివరించారు. అలానే దీక్షిత్ టీ షర్ట్ తోనే ఆయన మెడకు ఉరి బిగించి చంపినట్టు ఆయన పేర్కొన్నారు. ఘటన జరిగిన స్థలం నుండే దీక్షిత్ తల్లికి ఫోన్ చేసి 45 లక్షలు ఇవ్వాలని సాగర్ డిమాండ్ చేశాడని ఆయన అన్నారు. మంద సాగర్ ఒక్కడు మాత్రమే ఈ హత్యలో పాల్గొన్నాడని ఈ కేసులో మిగతా వారికి ఎలాంటి సంభందం లేదని ఆయన పేర్కొన్నారు.