ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ సారథ్యంలో పలువురు నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆప్ నేషనల్ సెక్రెటరీ పంకజ్ గుప్తా, ఢిల్లీ మేయర్ షెల్బీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ ఆలేయ్ అహ్మద్ ఇక్బాల్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే.. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేస్తోందేమోన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఆదివారం ఉదయం 11.40 గంటలకు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) కార్యాలయంలో కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ కేసులో నిందితులు, అనుమానితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా సీబీఐ ఆయనను ప్రశ్నిస్తోంది. అయితే ఆయనకు మద్దతుగా సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఢిల్లీ రాష్ట్ర మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ధర్నాకు దిగారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ వీరు అక్కడి నుంచి కదలబోమని తెగేసి చెప్తున్నారు.
శాంతిపూర్వకంగా నిరసనలు తెలుపుతున్న వారిని ఎందుకు అరెస్టు చేశారంటూ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోదీ ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ తదుపరి కార్యాచరణపై నిర్ణయించేందుకు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు.