ప్రమాదాల్లో గాయపడిన వారిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తరలించి చికిత్సను అందించాలి. వారిని ప్రమాదం జరిగాక 30 నుంచి 60 నిమిషాల్లోగా హాస్పిటల్‌కు తరలించాలి. దాన్నే గోల్డెన్ అవర్ అంటారు. ఆ సమయం మించాక తీసుకువస్తే క్షతగాత్రులను రక్షించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకనే ప్రమాదాలు జరిగినప్పుడు ఆంబులెన్స్‌ల ద్వారా వీలైనంత త్వరగా బాధితులను హాస్పిటల్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఆంబులెన్స్ దొరక్కపోతే బాధితులకు ఇబ్బందులు కలుగుతాయి. ఇదే విషయాన్ని గమనించిన ఆ దంపతులు గత 19 ఏళ్లుగా బాధితులకు ఉచితంగా ఆంబులెన్స్ సేవలను అందిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఢిల్లీకి చెందిన హిమాంషు, ట్వింకిల్ కాలియాలు దంపతులు. 2002లో వారికి వివాహం అయింది. అయితే హిమాంషుకు 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు.. అంటే 1992లో అతని తండ్రి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆంబులెన్స్ కోసం యత్నించారు. కానీ దొరకలేదు. ఫలితంగా రాత్రి 7 గంటలకు ప్రమాదం జరిగితే అదే రోజు అర్థరాత్రి 2 గంటలకు హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది. హాస్పిటల్‌కు తరలించడం బాగా ఆలస్యం కావడంతో హిమాంషు తండ్రి కోమాలోకి వెళ్లిపోయాడు. తరువాత 2 ఏళ్లకు అతను కోలుకున్నాడు. అయితే తమకు జరిగినట్లు ఇంకెవరికి జరగకూడదని భావించిన హిమాంషు తల్లిదండ్రులు అతను పెళ్లి చేసుకున్న రోజునే అతనికి ఆంబులెన్స్‌ను బహుకరించారు. ఇక అప్పటి నుంచి హిమాంషు దంపతులు ఢిల్లీలో ఉచితంగా ఆంబులెన్స్ సేవలను అందిస్తున్నారు.
ప్రస్తుతం వారి వద్ద 14 ఆంబులెన్స్‌లు ఉన్నాయి. 10 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. ఇందుకు గాను వారు ప్రత్యేకమైన నంబర్లను కూడా ఏర్పాటు చేశారు. కాల్ రాగానే వారు వెంటనే ఆంబులెన్స్ లను పంపిస్తారు. అయితే వారు ఈ సేవను ఉచితంగానే అందిస్తున్నారు. దీంతో ఆంబులెన్స్‌ల నిర్వహణ ఖర్చులు, ఇంధన ఖర్చులు, డ్రైవర్లకు జీతాలను వారు తమ సొంత డబ్బుల్లోంచి తీసి ఇస్తున్నారు.
స్వతహాగా ఇన్సూరెన్స్ ఏజెంట్లు అయిన హిమాంషు దంపతులకు ఆ ఆంబులెన్స్‌లను నిర్వహించడం కష్టంగా మారింది. వారు చేస్తున్న సేవలకు ఎన్నో అవార్డులు లభించినా వారికి ఎవరూ సహాయం చేయడం లేదు. దీంతో వారు సేవ చేయడం కష్టంగా మారింది. దీంతో వారు అప్పుల పాలయ్యారు. ప్రస్తుతం వారు తమకు సహాయం అందించేవారి కోసం ఎదురు చూస్తున్నారు.