దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పట్ల అలర్ట్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఆ వైరస్‌ను అడ్డుకునేందుకు గాను ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగానే ఢిల్లీలో మెట్రో రైళ్లు, స్టేషన్లను పూర్తిగా శుభ్రం చేయించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) సోమవారం సాయంత్రం ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లు, రైళ్లను డీఎంఆర్‌సీ శుభ్రం చేయనుంది. రైళ్లలో, స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కువగా చేతులు ఉంచే చోట ఇంకాస్త ఎక్కువగానే శుభ్రం చేయనున్నారు. ముఖ్యంగా ట్రైన్లలో హ్యాండ్ రెయిలింగ్స్, డోర్లు, స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, హ్యాండ్ రెయిలింగ్‌లను ఎక్కువగా శుభ్రం చేయనున్నారు. మరో వైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని మెట్రో అధికారులు తెలిపారు.
కాగా సోమవారం వరకు దేశవ్యాప్తంగా 43 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మన దేశంలో ఎవరూ మృతి చెందలేదు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వల్ల 3800 మంది ఇప్పటి వరకు చనిపోయారు.