కొన్ని ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు రాయాలంటే మెడలో నగలు, చేతికి వాచ్, ఇలా రకరకాల వస్తువులు ఉండకూడదనే నిబంధనలు తెలుసు. కానీ ఓ వ్యక్తికి చేతి పచ్చబొట్టు ఉందనే కారణంతో అతడు ఉద్యోగానికి అనర్హుడయ్యాడు. ఇంతకీ అదేం ఉద్యోగం..? ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
కుడిచేతి వెనుకభాగంలో మతపరమైన టాటూ ఉందనే కారణంగా కేంద్ర పోలీసు దళాలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తదితర బలగాల్లో ప్రవేశానికి అనర్హుడిగా ప్రకటితుడైన ఓ యువకుడు అధికారుల నిర్ణయాన్ని దిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు. సెల్యూట్ చేయడానికి ఉపయోగించే కుడిచేతి మీద మతపరమైన పచ్చబొట్టు ఉండటం కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధమని అధికారుల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
వైద్యపరీక్షలో తనకు ఎలాంటి లోపాలూ లేవని తేలిందనీ, చేతి మీది పచ్చబొట్టును చిన్నపాటి లేజర్ శస్త్రచికిత్సతో తొలగించుకుంటానని పిటిషనర్ కోర్టుకు విన్నవించాడు. రెండు వారాల్లోపు పచ్చబొట్టు తొలగించుకొని కొత్త వైద్యపరీక్షలకు బోర్డు ముందు హాజరుకావడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ హైకోర్టు కేసును ముగించింది. నియామకానికి అర్హుడని వైద్యబోర్డు నిర్ధరిస్తే, చట్టానికి అనుగుణంగా అతడిని రిక్రూట్ చేసుకోవాలని హైకోర్టు తీర్పు చెప్పింది.