ఆటో ఆంబులెన్స్.. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత సేవ..

హర్జీందర్ సింగ్ కేవలం తన ఆటోను ఉచిత ఆంబులెన్స్‌లా వాడి సేవ అందించడమే కాదు, తన ఇంటి చుట్టు పక్కల ఉండే పేదలకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తాడు.

సమాజంలో మనతో కలిసి జీవించే తోటి వారికి సహాయం చేయాలి.. ఇరుగు పొరుగు వారు ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి.. అలా చేయలేకపోతే మనం మనుషులమే కాదు.. తోటి వారి పట్ల మానవత్వం చూపించాలి.. అవును.. ఈ మాటలను నమ్మాడు కాబట్టే ఆ వృద్ధుడు ఎన్నో ఏళ్ల నుంచి తోటి వారికి తనకు చేతనైనంత సహాయం చేస్తున్నాడు. అతనే ఢిల్లీకి చెందిన హర్జీందర్ సింగ్..!

హర్జీందర్ సింగ్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. ఢిల్లీలో ఉంటాడు. వయస్సు 76 సంవత్సరాలు. అయినా నిత్యం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతను రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎవరైనా తనకు కనిపిస్తే వారిని తన ఆటోలో ఉచితంగా హాస్పిటల్‌కు తరలిస్తాడు. అందుకనే తన ఆటోపై వెనుకాల Free ambulance for injured in road accident (రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి ఉచితంగా ఆంబులెన్స్ సేవ) అని బోర్డు రాయించాడు. రాయించడమే కాదు.. 1978 నుంచి తన ఆటోలో ఇలా సేవ చేస్తున్నాడు.

అయితే హర్జీందర్ సింగ్ కేవలం తన ఆటోను ఇలా ఉచిత ఆంబులెన్స్‌లా వాడి సేవ అందించడమే కాదు, తన ఇంటి చుట్టు పక్కల ఉండే పేదలకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తాడు. ఇక తన ఆటోలో ఓ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుంది. ఎవరికైనా స్వల్ప గాయాలైతే స్వయంగా ఇతనే ఫస్ట్ ఎయిడ్ కిట్ ద్వారా గాయాలకు చికిత్స చేస్తాడు. ఈ వయస్సులోనూ హర్జీందర్ సింగ్ ఇలా సేవ చేస్తున్నందుకు అతన్ని అందరూ అభినందిస్తున్నారు. అలాగే ఇప్పుడీయన సోషల్ మీడియాలోనూ హీరో అయ్యాడు..!