పోలీసుల సంచలన నిర్ణయం, వాళ్ళ కోసం ఢిల్లీలో ప్రత్యేక జైలు…!

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సిటీ పోలీసులు గత వారం నగరానికి వాయువ్య దిశలో ఒక స్టేడియంలో తాత్కాలిక జైలు నిర్మించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు,

“పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ మొత్తం జరుగుతున్న నిరసనల దృష్ట్యా” ఇది అవసరమైన చర్యగా పోలీసులు అభివర్ణించారు. జనవరి 29 నాడు రాసిన లేఖ కాపీ జాతీయ మీడియా సంపాదించింది. ఆదివారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజధానిలో శాంతిభద్రతల విచ్ఛిన్నానికి దారి తీయడానికి “కొంతమంది నిరసనకారులు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధమైన లేదా హింసాత్మక మార్గాలను అవలభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు.

పౌరసత్వ వ్యతిరేక చట్ట నిరసనకారులు జామియా మిలియా ఇస్లామియా నుండి రాజ్‌ఘాట్ వరకు మానవ హారాన్ని ప్లాన్ చేసిన సమయంలో తాము ఈ లేఖ రాసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఇది ఎప్పుడు జరగలేదని, ఆ లేఖ తాము రాయలేదని… ఢిల్లీ పోలీసులు మరో ప్రకటనలో చెప్పడం విశేషం. దేశ రాజధానిలోని కంజవాలా ప్రాంతంలోని స్టేడియంను తాత్కాలిక జైలుగా మార్చమని కోరిన లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయానికి పంపినట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.