డెంగ్యూ” ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యాధుల్లో ఇది ఒకటి. అపరిశుభ్ర ప్రదేశాల్లో ఉండే దోమల కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ముందు ప్రజల్లో అవగాహన లేకపోవడంతో పాటు… దోమకాటు నుంచి రక్షణ తీసుకోకపోవడం, వ్యాధి లక్షణాలు తెలియక అశ్రద్ధ చేయడంతో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. 2019 లో భారతదేశంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరిగింది. డెంగ్యూ ఏడెస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది మరియు సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు మరియు చర్మ దద్దుర్లు.
ఈ వ్యాధి యొక్క వైరస్లు సాధారణంగా 10 రోజుల వరకు ఉంటాయి. సరైన వైద్యం అంధక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ వ్యాధి గురించి ఒక సంచలన విషయం బయటపడింది. స్వలింగ సంపర్కం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని ఒక కేసు ద్వారా బయటపడింది. స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్ నగరానికి చెందిన 41 ఏండ్ల ఓ స్వలింగ సంపర్కుడు డెంగ్యూ సోకిన తన సహచరుడితో లైంగిక చర్యలో పాల్గొనడంతో అతనికి కూడా డెంగ్యూ వచ్చిందని వైద్యులు గుర్తించారు.
తొలుత దోమకాటు కారణంగా డెంగ్యూ సోకిందని భావించిన వైద్యులు అనుమానం వచ్చి అనేక పరీక్షలు చేశారు. దీనితో అసలు విషయం బయటపడింది. సదరు వ్యక్తి సహచరుడు క్యూబా పర్యటనలో ఉండగా అతనికి డెంగ్యూ వైరస్ సోకిందని ఆ తర్వాత అతను అతనితో శృంగారంలో పాల్గొనడంతో ఈ వ్యాధి అతనికి కూడా వచ్చిందని వైద్యులు తమ పరిశోధనల్లో వెల్లడించారు. స్వలింగ సంపర్కం ద్వారా డెంగ్యూ సోకడం ఇదే తొలిసారి అని మాడ్రిడ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు మీడియాకు వివరించారు. దీనితో వ్యాధి సోకిన వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.