కరోనా మొదటి వేవ్ కారణంగా గతేడాది మార్చి నుంచి దాదాపుగా 3 నెలల పాటు లాక్‌డౌన్‌ను విధించారు. తరువాత నెమ్మదిగా ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. ఇక రెండో వేవ్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్ లేకపోయినప్పటికీ అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నాయి. అయితే లాక్‌డౌన్‌లు అమలులో ఉన్నా, రైళ్ల రాకపోకలు భారీగా తగ్గినా.. రైలు పట్టాలపై పడి చనిపోతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. తాజాగా వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది.
2020వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై 8733 మంది చనిపోయారు. గతేడాది చాలా రోజుల పాటు లాక్‌డౌన్ అమలులో ఉంది. రైళ్లను కూడా పెద్దగా నడిపించలేదు. అయినప్పటికీ అంతటి భారీ స్థాయిలో ప్రజలు రైలు పట్టాలపై చనిపోవడం గమనార్హం. అయితే వారిలో చాలా మంది వలసకూలీలే ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.
ఆర్‌టీఐ యాక్టు కింద మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ రైల్వే బోర్డుకు పిటిషన్ పెట్టుకోగా వారు పైన తెలిపిన సమాచారాన్ని వెల్లడించారు. 2020 జనవరి నుంచి డిసెంబర్ మధ్య డేటాను వారు సమాధానం రూపంలో అందజేశారు. ఇక కేవలం మధ్యప్రదేశ్‌లోనే 805 మంది రైల్వే పట్టాలపై చనిపోయారు.
కాగా లాక్‌డౌన్ వల్ల వలస కూలీలు అనేక మంది తమ సొంత ఊళ్లకు ప్రయాణించారని, వారు రహదారి మార్గం కన్నా తక్కువ పొడవు ఉండే రైలు మార్గాన్ని ఎంచుకున్నారని, అందుకనే చాలా మంది రైలు పట్టాల వెంబడి ప్రయాణించి సొంత ఊళ్లకు వెళ్లారని రైల్వే అధికారులు తెలిపారు. కానీ దురదృష్టవశాత్తూ వారిలో కొందరు రైలు ప్రమాదాల బారిన పడి చనిపోయారని అన్నారు. అందుకనే ఆ సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. ఇక 2016 నుంచి 2019 మధ్య కాలంలో 56,271 మంది రైలు పట్టాలపై చనిపోయారని తెలిపారు.