పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన హైకోర్టు ఓ కేసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నంత మాత్రాన ఒక మహిళ చెడ్డ తల్లి అనిపించుకోదని కోర్టు వ్యాఖ్యానించింది. ఓ జంట తమ కుమార్తె విషయంలో కోర్టును ఆశ్రయించగా కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.
ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తికి, భారతీయ మహిళకు వివాహం జరిగింది. వారు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం భర్త ఇండియాలోనే ఉంటుండగా అతని భార్య ఆస్ట్రేలియాలో ఉంటోంది. వారికి 4 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఆ మహిళ ఇంకో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఆమె భర్త విడాకులు తీసుకున్నాడు. అయితే కుమార్తెను తన దగ్గరే పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ తన కుమార్తెను తనకు అప్పగించాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేసింది.
కోర్టులో ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రెవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఇంకో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నంత మాత్రాన ఆమె చెడ్డ మహిళ, చెడ్డ తల్లి కాదని, మహిళ క్యారెక్టర్‌ను అలా నిర్ణయించలేమని వ్యాఖ్యలు చేశారు. ఆ మహిళ తన కాళ్లపై తాను నిలబడి జీవిస్తుందని, కుమార్తెను పోషించుకునే సామర్థ్యం ఉందని కోర్టు పరిశీలించింది. దీంతో న్యాయమూర్తి ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఆమె కుమార్తెను ఆమెకు అప్పగిస్తూ తీర్పు వెల్లడించారు.