ఏదేమైనా.. బట్టతల వచ్చాక కానీ.. దువ్వెన విలువ తెలియదన్నట్టుగా..! ఇప్పుడు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమాకు కూడా పార్టీ నేతలు, తన సామాజిక వర్గంలో యువత ఉన్నారనే విషయం.. వారి అవసరం ఇప్పుడు తెలిసి వస్తోందట. ఇప్పుడు ఆయన ఓడిపోవడమే కాదు.. రేపు.. తాను ఏదైనా కేసులో అరెస్టయినా.. పట్టించుకునేవారు ఎవరైనా ఉండాలంటే.. వారు ఖచ్చితంగా తన సామాజిక వర్గం వారి సపోర్ట్ తనకు లేకపోతే మైలవరంలో రాజకీయం చేయలేనన్న విషయం ఆయనకు అర్థమైందట. ఎందుకంటే.. తాను ప్రాతినిధ్యం వహించిన మైలవరంలో.. తన సొంత సామాజిక వర్గం హవా రాజకీయంగా ఎక్కువ.. పైగా తనకు పరోక్షంగా, ప్రత్యక్షంగా పదేళ్ల పాటు మద్దతిచ్చేది.. వారే కనుక.
అయితే మంత్రి అయ్యాక ఈ వర్గంలో చాలా మంది నేతలను ఉమా జిల్లా స్థాయిలోనే కాదు.. నియోజకవర్గ స్థాయిలోనూ తొక్కిపట్టేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీలో ఇతర కులాల నేతలు అయిన బుద్ధా వెంకన్న, మండలి బుద్ధ ప్రసాద్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కాగిత వెంకట్రావు లాంటి నేతలనే కాదు సొంత వర్గం అయిన కమ్మ నేతల్లో వంశీ, కేశినేని నాని, బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్ లాంటి నేతలను కూడా అణగదొక్కాలనే చూశారు. దీంతో గత ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో సొంత వర్గం అంతా వైసీపీ అభ్యర్థి కేపీకి సపోర్ట్ చేసింది. కేపీ కూడా కమ్మ నేతే కావడంతో మైలవరంలో ఈ వర్గం అటే మొగ్గింది.
ఇదే విషయం.. ఇటీవల ఉమాకు స్పష్టమైంది. ఉమాపై ప్రస్తుత మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వు గోలి సోడా కొట్టుకునే కుటుంబం నుంచి వచ్చావు.. అంటూ నాని.. ఉమాపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పార్టీ తరఫున నిజంగానే ఉమాకు మద్దతు వస్తుందని, ఈ వ్యాఖ్యలను ఎవరైనా ఖండిస్తారని అనుకున్నారు. కానీ, అటు చంద్రబాబు, ఇటు ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ లు ఎక్కడా పట్టించుకోలేదు. ఎందుకంటే.. కొడాలి నాని తమపై కూడా నిప్పులు చెరిగాడు కనుక.. వీరు.. మౌనం పాటించారు. ఈ నేపథ్యంలో ఉమా రగడను పట్టించుకునే నాయకుడు కనిపించకుండా పోయారు. కనీసం జిల్లా స్థాయి కమ్మ టీడీపీ నేతలుగా ఉన్న ఎంపీ కేశినేని, తూర్పు ఎమ్మెల్యే గద్దె లాంటి వాళ్లే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉమాను తిట్టిన కొడాలికి కౌంటర్ ఇవ్వలేదు. కనీసం నియోజకవర్గంలో కూడా ఏ కమ్మ టీడీపీ నేతా స్పందించని పరిస్థితి.
ఈ నేపథ్యంలో తాను ఒంటరి అయిపోయాననిభావించిన ఉమా.. అప్పటి నుంచి నియోజకవర్గంలోని తన సామాజిక వర్గాన్ని కలుపుకొని పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతవైపు మొగ్గు చూపుతున్న టీడీపీ శ్రేణులను తనవైపు మళ్లించుకునేందుకు ఉమా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయనను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదని అంటున్నారు. అయినప్పటికీ.. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే ధోరణితో ఉమా ప్రయత్నాలు సాగిస్తుండడం.. పార్టీలో తాజాగా చర్చనీయాంశంగా మారింది. మరి ఎంత మంది కలిసి వస్తారో చూడాలి. ఎవరిని కదిలించినా.. ఆయనతో వేగలేం! అనే మాటే వినిపిస్తుండడం గమనార్హం.
-vuyyuru subhash