కరోనా వైరస్‌కు మెడిసిన్‌ను తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు శ్రమిస్తున్నారు. అనేక ఫార్మా కంపెనీలు ఈ మేరకు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ చేపట్టాయి. పలు ఔషధాలు కరోనాను నయం చేస్తాయని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ అవి అందుబాటులోకి రావాలంటే మరో ఏడాది అయినా పడుతుందని సైంటిస్టులు అంటున్నారు. ఇక మరోవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతోపాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. అయితే కరోనా వైరస్ బారిన పడి ఎమర్జెనీ యూనిట్లలో చికిత్స పొందుతున్న వారికి డెక్సామెథాసోన్ అనబడే ఓ మెడిసిన్ ఆశాకిరణంలా మారింది. అసలింతకీ ఈ మెడిసిన్ ఏమిటి ? దీంతో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ? అంటే…
డెక్సామెథాసోన్‌ను నిజానికి ఇప్పుడే తయారు చేయలేదు. 1977 నుంచి దీన్ని వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన అత్యవసర మెడిసిన్స్ జాబితాలో ఈ మెడిసిన్ పేరు ఉంది. దీన్ని మన శరీరంలో మంట, వాపు, అలర్జీలను తగ్గించేందుకు వాడుతారు. అలాగే క్యాన్సర్ చికిత్సలోనూ ఈ మెడిసిన్‌ను ఉపయోగిస్తారు. ఇక దీన్ని ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వాడవచ్చని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ తెలిపింది. డెక్సామెథాసోన్ ఎమర్జెన్సీలో చికిత్స తీసుకునే కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడుతుందని వెల్లడైంది. దీని వల్ల మరణాలను తగ్గించవచ్చు.
డెక్సామెథాసోన్ మెడిసిన్ కరోనా రోగుల్లో మరణాలను 33 శాతం వరకు తగ్గిస్తుంది. అలాగే వెంటిలేటర్‌పై చికిత్స పొందే కరోనా రోగుల్లో మరణాలను 20 శాతం వరకు తగ్గిస్తుంది. దీంతో కరోనా బారిన పడే వారు చనిపోకుండా చూడవచ్చు. ఇక ఈ మెడిసిన్ ఖరీదు కూడా చాలా తక్కువ. అందువల్ల దీన్ని ఐసీయూలలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు వాడవచ్చని సైంటిస్టులు సిఫారసు చేస్తున్నారు.
కాగా ఈ మెడిసిన్‌ను కీళ్లవాతం, అల్సర్, శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, చర్మ సమస్యలు, రక్త సంబంధ అనారోగ్య సమస్యలకు ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. దీని వల్ల బరువు పెరగడం, బీపీ ఎక్కువ కావడం, వికారం, మత్తుగా ఉండడం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు, ఒత్తిడి తదితర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ మెడిసిన్ స్టెరాయిడ్ వర్గానికి చెందినది.