ఎయిర్‌ ఇండియాకు షాక్.. మరోసారి జరిమానా విధించిన డీజీసీఏ

-

ఎయిర్‌ ఇండియాకు డీజీసీఏ మరో షాక్ ఇచ్చింది. వారం వ్యవధిలోనే రెండో సారి జరిమానా విధించింది. గతేడాది పారిస్- దిల్లీ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలను రిపోర్ట్‌ చేయనందుకుగానూ డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది.

డిసెంబరు 6న పారిస్‌- దిల్లీ విమానంలో ఓ ప్రయాణికురాలు వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు.. మరో వ్యక్తి ఆమె సీట్‌పై ఉన్న దుప్పటిపై మూత్రవిసర్జన చేశాడు. అదే రోజు చోటుచేసుకున్న మరో ఘటనలో.. మద్యం మత్తులో మరుగుదొడ్ల గదిలో పొగతాగుతూ ఓ వ్యక్తి విమాన సిబ్బందికి పట్టుబడ్డాడు. తాము నివేదిక కోరేంత వరకు ఈ ఘటనలపై ఎయిర్‌ ఇండియా రిపోర్ట్‌ చేయకపోవడాన్ని డీజీసీఏ ఇదివరకే తప్పుబట్టింది.

ప్రయాణికుల వికృత చేష్టలకు సంబంధించిన నిబంధనలు పాటించడంలో విమాన సంస్థ ప్రతిస్పందన లోపభూయిష్ఠంగా, ఆలస్యంగా ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఇటీవల షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. తాజాగా రూ.10 లక్షల జరిమానా విధించింది. న్యూయార్క్‌- దిల్లీ విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటనలోనూ ఎయిర్‌ ఇండియాకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version