గుజరాత్‌లో ఉన్న హరప్పన్ నగరం ధోలావిరా కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ధోలావిరాను ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది యునెస్కో. తాజాగా యునెస్కో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాల నుంచి 1121 కట్టడాలను యునెస్కో గుర్తించింది.
ఈ సారి ప్రపంచం నలుమూలల నుంచి 255 ప్రతిపాదనలను పరిశీలించిన యునెస్కో.. ఎట్టకేలకు ధోలావిరాను అంతర్జాతీయ గుర్తింపును ఇచ్చింది. ఈ ధోలావిరాను ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించడం పై..ప్రధాని నరేంద్ర మోడి తో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే యునెస్కో గుర్తింపు వచ్చిందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి పేర్కొన్నారు. కాగా రెండు రోజుల కింద తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయాన్ని కూడా ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది యునెస్కో. దీంతో ఈ సారి ఇండియా తరఫున రెండు కట్టడాలు ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపును తెచ్చుకున్నాయి.