NRC, NPRకి తేడా ఏంటి…? ఏం ఏం సేకరిస్తారు…?

-

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై ఒక పక్క వివాదం చల్లారక ముందే… NPRని తెరపైకి తెచ్చి దాని కోసం రూ.3,900 కోట్ల బడ్జెట్ కేటాయిచింది కేంద్రం. ఇప్పటికే ఎన్నార్సి విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో… NPR ద్వారా దేశంలో నివసిస్తున్న వారి జాబితాను తయారు చేయనుంది కేంద్రం. దేశ పౌరుల లెక్క తేల్చడానికి కాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అక్రమంగా నివసించే వారిని పంపించడానికి ముందు దీని ద్వారా కేంద్రం అడుగు వేస్తుందని,అప్పుడు విదేశీయుల పేరుతో కొంత మందిని దేశం నుంచి పంపిస్తారు అనే ఆరోపణలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్నార్సి ని అసోం లో మాత్రమే అమలు చేస్తున్న కేంద్రం తర్వాత దేశం మొత్తం అమలు చేస్తామని చెప్తుంది. NPR ద్వారా దేశంలో ఎంత మంది నివాసం ఉంటున్నారు…? ఒక ప్రాంతంలో ఆరు నెలల నుంచి నివాసం ఉన్న వారిని రాబోయే ఆరు నెలల్లో లేదా అంత కంటే ఎక్కువ కాలం ఏదైనా ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్న వారిని మాత్రమే స్థానిక పౌరులు గా గుర్తించి ఇంటి ఇంటికి వివరాలను అధికారులు సేకరిస్తారు.

ఇందులో భాగంగా దేశంలో గత ఆరు నెలలు గా నివసిస్తున్న విదేశీయుల వివరాలను కూడా నమోదు చేస్తారు. అయితే ఎన్నార్సి లో మాత్రం భారతీయులు మాత్రమే ఉంటారు. అందుకే NPRకి NRCతో సంబంధం లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. పౌరసత్వ చట్టం-1955, పౌరసత్వం (పౌరుల నమోదు మరియ గుర్తింపు కార్డుల జారీ) నిబంధనలు-2003 ఆధారంగా NPRని తయారు చేస్తారు. దేశంలో ఉండే సాధారణ నివాసితులందరూ తప్పక NPRలో నమోదు చేయించుకోవాలి. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి, సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది.

ఇందులో ప్రజల డెమోగ్రాఫిక్‌తో పాటు బయోమెట్రిక్ డేటాను అధికారులు నమోదు చేసుకుంటారు. జనాభా లెక్కలను గతంలో మాదిరిగా గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. వారి ఆధార్,మొబైల్ నంబర్,పాన్,డ్రైవింగ్ లైసెన్స్,ఓటర్ కార్డు,పాస్‌పోర్టు వంటి ధ్రువీకరణ వివరాలను సేకరిస్తారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆధార్ వివరాలు ఇవ్వడం, ఇవ్వకపోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్ ఈ డేటా బేస్‌ను పర్యవేక్షి౦చనుంది.

ఎన్ఆర్‌సీలో పేరు నమోదైనవారు మాత్రమే దేశ పౌరులుగా పరిగణించబడుతారు. ఐతే NRCలోని పేరులేని వారిని వెంటనే విదేశీయులుగా ప్రకటించకుండా న్యాయ పోరాటం చేసుకునేందుకు కేంద్రం మరో అవకాశం కల్పించింది. తమకు అన్యాయం జరిగిందని భావించిన వాళ్లు ఫారిన్ ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. ట్రిబ్యునల్స్‌లో కేసు ఓడిపోతే హైకోర్టును అవకాశం ఉంటుంది. అక్కడ కూడా న్యాయం జరగకపోతే చివరగా సుప్రీంకోర్టులోనూ కేసు వేయవచ్చు. ఇక అసోంలో ఇటీవల NRC పూర్తి చేసినందున..

అక్కడ మళ్లీ జన గణన చేపట్టరు. NRC సందర్భంగా ఇప్పటికే అక్కడి ప్రజల వివరాలన్నింటినీ సేకరించారు. 2010లో NPR కోసం తొలిసారి డేటా సేకరించారు. 2011 జనాభా లెక్కలో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టారు. 2010 NPRలో 15 అంశాల వివరాలను సేకరిస్తే.. ఈసారి మాత్రం 21 డేటా పాయింట్లను అధికారులు సేకరిస్తారు. ఇక గతంలో వేర్వేరు డేటా పాయింట్లుగా ఉన్న తండ్రి పేరు, తల్లి పేరు, భాగస్వామి పేరును క్లబ్ చేసి ఒకే అంశంగా తయారు చేసారు. ఈ నేపథ్యంలో ఈసారి కొత్తగా 8 డేటా అంశాలు అదనంగా చేర్చారు.

1. వ్యక్తి పేరు
2. ఇంటి పెద్దతో బంధుత్వం
3. లింగం
4. పుట్టిన తేదీ
5. వివాహం
6.విద్యార్హతలు
7. వృత్తి
8. తండ్రిపేరు/తల్లి పేరు/దాంపత్య భాగస్వామి
9. పుట్టిన స్థలం
10. ప్రస్తుతం నివాస చిరునామా
11. ప్రస్తుత నివాస చిరునామాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు.
12. జాతీయత
13. శాశ్వాత నివాస చిరునామా

14. ఆధార్ కార్డ్ నెంబర్ (వాలంటరీ)
15. మొబైల్ నెంబర్
16. తల్లిదండ్రులు పుట్టిన తేదీ, పుట్టిన స్థలం
17. చివరగా నివసించిన చిరునామా
18. పాస్ పోర్ట్
19. ఓటర్ ఐడీ కార్డ్ నెంబరు
20. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)
21. డ్రైవింగ్ లైసెన్స్

ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా NRCని తీసుకోచ్చే ఆలోచన లేదని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. దీని గురించి పార్లమెంట్‌లో గానీ, కేబినెట్‌లో చర్చ జరగలేదని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఐతే 2018-19 వార్షిక నివేదికలో మాత్రం దేశవ్యాప్త NRCకి NPRతొలి అడుగు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news