ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఆన్ లైన్ టికెటింగ్ నిర్ణయం పై రచ్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ అంశంపై రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టాన్ని ప్రభుత్వం దోచుకుంటుందని..తన పై పగతో ఆన్ లైన్ టికెటింగ్ తీసుకువచ్చారన్న విధంగా పవన్ కామెంట్లు చేశారు. ఇక ఇలా అన్లైన్ టికెటింగ్ పై ఆరోపణలు వస్తుండటంతో నేడు సినీ పెద్దలతో మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు.
అయితే సమావేశం అనంతరం దిల్ రాజు ఆన్ లైన్ టికెటింగ్ తీసుకురావాలని పరిశ్రమ తరపున తామే గతంతో చిరంజీవి, నాగార్జున ఇతర పెద్దలతో కలిసి ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. అయితే అప్పుడు తాము చర్చించిన అంశాల సారాంశాన్ని చెప్పకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని అన్నారు. అంతే కాకుండా సినీ పరిశ్రమను వివాదాలకు దూరంగా ఉంచాలని కోరారు. ఇదిలా ఉంటే పవన్ ఆన్లైన్ టికెటింగ్ పై మండి పడుతుండగా నిర్మాతలు మాత్రం ప్రభుత్వం తరపున మాట్లాడటం ఆసక్తి రేపుతోంది.