ట్రోలర్స్‏కు సీతారామం డైరెక్టర్ కౌంటర్‌… నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చిన హను

-

‘సీతా రామం’లోని ఓ సీన్‌ వెంకటేశ్‌ – కత్రినా కైఫ్‌ నటించిన ‘మల్లీశ్వరి’లోని లవ్‌ సీన్‌ని పోలి ఉందంటూ వస్తోన్న ట్రోల్స్‌పై దర్శకుడు హను రాఘవపూడి స్పందించారు. ఆ సీన్‌ కాపీ కొట్టలేదని చెప్పుకొచ్చారు. ‘‘లవ్‌ ప్రపొజల్‌ సీన్‌ చాలా సింపుల్‌ ఐడియా. ఒక అబ్బాయి తన ప్రేయసికి భరోసానివ్వడాన్ని ఆ సీన్‌లో చూపించాలనుకున్నా. అందుకే హీరోతో.. నేను నెలకు రూ.600 సంపాదిస్తున్నా. బ్యాంకులో రూ.12,000 ఉంది. దాంతో ఇల్లు కొనుక్కుందాం.. అని చెప్పించా. ఇది బేస్‌ ఐడియా మాత్రమే. దీన్ని ‘మల్లీశ్వరీ’ నుంచి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ‘మల్లీశ్వరీ’తో పోల్చినందుకు ఆనందంగా ఉంది’’ అని హను చెప్పుకొచ్చారు.

 

అనంతరం ఈ సినిమా కోసం మొదటి నుంచి దుల్కర్‌ని మాత్రమే అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. ‘‘సీతారామం కోసం నేను వేరే హీరోలను అనుకున్నట్లు.. చివరికి దుల్కర్‌ సల్మాన్‌ను ఓకే చేసినట్లు వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. నేను ఈ స్టోరీ రాసినప్పుడే రామ్‌ పాత్ర కోసం దుల్కర్‌ని అనుకున్నా. ఈ సినిమా ప్రకటించిన తర్వాత నాని, రామ్‌, విజయ్ దేవరకొండ వంటి స్టార్‌ హీరోలను కలిశా. దాంతో వాళ్లందరూ వద్దనడం వల్లే ఈ ప్రాజెక్ట్‌లోకి దుల్కర్‌ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిజం చెప్పాలంటే నానితో నేను ఓ కొత్త ప్రాజెక్ట్‌ చేయాలనుకుంటున్నా. రెండో ప్రపంచయుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో అది ఉండనుంది. ఆ ప్రాజెక్ట్‌ నిమిత్తం ఆయన్ని కలిశా. ఇక, రామ్‌, విజయ్‌ని కూడా వేర్వేరు కథల కోసం కలిశా’’ అని వివరించారు.

‘‘ఈ సినిమా ముగింపు గురించి చాలా మంది నుంచి నాకు మెస్సేజ్‌లు వస్తున్నాయి. క్లైమాక్స్‌లో రామ్‌ పాత్రని చంపకుండా ఉండాల్సిందని వాటి సారాంశం. నా దృష్టిలో రామ్‌ ఓ అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ముగింపు ఇలా కాకుండా పాక్‌ సైన్యం చేతుల్లో బంధిగా ఉన్న అతడు ఇండియాకు తిరిగి వచ్చినట్లు చూపిస్తే ప్రేక్షకులు అంతగా కనెక్ట్‌ కాలేరు. అందుకే రామ్‌ పాత్రను అలా ముగించాం. క్లైమాక్స్‌ విషయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌తో నాకెన్నో గొడవలు జరిగాయి. కేవలం స్వప్నాదత్‌ మాత్రమే నా ఆలోచనను ముందు నుంచి అర్థం చేసుకున్నారు’’

‘‘అక్కడ ఉద్యోగం మానేశా. నీ వద్ద ఉద్యోగం చేద్దామని’ అని సినిమా సెకండాఫ్‌లో హీరోయిన్‌ ఓ డైలాగ్‌ చెబుతుంది. దాన్నే మేము మొదట షూట్‌ చేశాం. అలాగే ఈ సినిమాలో హీరో ప్రపోజల్‌ సీన్‌ని చివరి రోజు షూట్‌ చేశాం’’ అని హను వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version