ఓ వైపు వై నాట్ 175 అంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు టార్గెట్‌లు పెడుతున్నారు. కానీ నియోజకవర్గాల్లో మాత్రం నేతల మధ్య సయోధ్య లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ నేతలు కొట్టుకుంటున్నారు. టికెట్ల కోసమో, లేదంటే తమ నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనో నిత్యం దెబ్బలాడుకుంటున్నారు. అధిష్టానం కూడా చాలా సార్లు చెప్పి చూసినా నేతల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌ను కొందరు వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ బాహాటంగానే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో యర్రవరంలోని ఓ ఫాంహౌస్‌లో బుధవారం అసమ్మతి నేతల మధ్య రహస్య భేటీ జరిగింది. ఈ మీటింగ్‌కు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు దంపతులు సహా పలువురు నేతలు హాజరయ్యారు. జగన్‌ను మరోసారి సీఎంని చేద్దామని.. ఇందుకోసం కష్టపడతామని నేతలు తేల్చిచెప్పారు. కానీ ప్రత్తిపాడులో అభ్యర్ధిని మార్చాల్చిందేనని.. అలా అయితేనే సహకరిస్తామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే అధిష్టానానికి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశామని.. కానీ అటు నుంచి మాత్రం స్పందన రాలేదని నేతలు చెబుతున్నారు. హైకమాండ్ నిర్ణయం కోసం కొద్దిరోజులు వెయిట్ చేద్దామని… తర్వాత నిర్ణయం తీసుకుందామని నేతలు నిర్ణయించారు.