సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా కానుకగా సింగరేణి కార్మికులకు లాభాల వాటాగా బోనస్ రూ.711.18 కోట్లను విడుదల చేశారు. ఈనెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సంస్థ చైర్మన్, ఎం.డీ. ఎన్.శ్రీధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఇవాళ బోనస్ విడుదల చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా.. గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్ల రూపాయలతో 32 శాతం లాభాల బోనస్ ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లించనున్నట్టు తెలిపారు.
సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1లక్ష 53వేల వరకు లాభాల బోనస్ అందనుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతంలో కంటే ఎక్కువ శాతాన్ని లాభాల వాటాగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు సింగరేణి ఉద్యోగుల తరపున చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ చెల్లింపుపై డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ బలరాం గురువారం ఓ సర్క్యూలర్ జారీ చేశారు.