శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఈ తెల్లవారుజామూన ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలం దగ్గరకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. అయితే దిశ హత్యకేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది.
చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారుజామున నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులను ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్ ద్వారా సరైన సమాధానం చెప్పారంటూ స్థానికులు వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులతో పాటు ముఖ్యమంత్రి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో జనాలు తరలి రావడంతో 44వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది.