మనం మన తల్లిదండ్రులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో కలిసి పంచుకుంటాం. అందుకనే మనకు ఏదైనా ఆపద వస్తే ముందుగా మన స్నేహితులకే ఆ విషయం ఆటోమేటిగ్గా తెలుస్తుంది. అదీ స్నేహానికున్న పవర్.
ఏ మనిషికైనా డబ్బు చేతిలో ఉందంటే చాలు.. ఎక్కడ లేని దూరపు బంధువులు కూడా సడెన్‌గా బంధుత్వం కలుపుకుని చెంతకు చేరుతుంటారు. అదే ఎవరైనా మనిషి కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే.. సహాయం చేయడం మాట అటుంచి.. కనీసం అలాంటి వారిని పలకరించేందుకు, వారిని ఓదార్చేందుకు కూడా ఎవరూ సాహసం చేయరు. దూరంగా ఉంటారు. కానీ.. కేవలం నిజమైన స్నేహితులు మాత్రమే అన్ని సమయాల్లోనూ మన వెంట ఉంటారు. సుఖాలను మనతో పంచుకుంటారు. కష్టాలను వారు భరించి మనకు సుఖాలను అందిస్తారు. అలాంటి స్నేహితులే మనకు నిజమైన మిత్రులు.. ఆపదలో నేనున్నానని ఆదుకునేవారే అసలైన స్నేహితులు.
మనం మన తల్లిదండ్రులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో కలిసి పంచుకుంటాం. అందుకనే మనకు ఏదైనా ఆపద వస్తే ముందుగా మన స్నేహితులకే ఆ విషయం ఆటోమేటిగ్గా తెలుస్తుంది. అదీ స్నేహానికున్న పవర్. స్నేహితులైతే తమను బాగా పట్టించుకుంటారని ఎవరైనా అనుకుంటారు. ఇక స్నేహానికి పేద, ధనిక అన్న తేడా ఉండదు. గుడిసెల్లో ఉండేవారికి మేడల్లో ఉండేవారు స్నేహితులుగా ఉండవచ్చు. అలాగే వారు వీరికి ప్రాణమిత్రులుగా మారవచ్చు. ఎలాగైనా ఉండవచ్చు. అయితే స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏ వ్యక్తి అయినా సరే.. తన స్నేహితుల పట్ల ఎలా ఉండాలి.. వారి కోసం ఏమేం చేయాలి.. అన్న విషయాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం..!
* స్నేహితుల దినోత్సవం రోజున మీకు నచ్చిన వస్తువు కాకుండా… మీ స్నేహితుడికి నచ్చిన వస్తువును బహుమతిగా ఇవ్వండి. వీలుంటే ఆ వస్తువును మీరే మీ చేతుల్తో స్వయంగా చేసి ఇస్తే.. అది ఎంత మధురమైన అనుభూతిని ఇస్తుందో మీకే తెలుస్తుంది. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు, కార్డులు, మెసేజ్‌లు, కవితలు, కాగితపు బొమ్మలు.. ఇలా ఏదైనా సరే.. మీ చేతుల్తో మీరే స్వయంగా తయారు చేసి ఆ వస్తువులను మీ స్నేహితులకు ఇచ్చి చూడండి. అప్పుడు వారు థ్రిల్ కాకపోతే చెప్పండి.
* ఫ్రెండ్‌షిప్ డే రోజున మీ స్నేహితులతో కలిసి ఫొటోలు దిగండి. ఏటా అదే రోజన ఫొటోలు దిగి అప్పటికి, ఇప్పటికి మీలో వచ్చే మార్పులను మీరు గమనించండి. అదొక రకమైన థ్రిల్‌ను అందిస్తుంది. ఇక మీరు దిగిన ఫొటోలను ప్రింట్ వేయించి, వాటిని ఫ్రేమ్ కట్టించి మీ ఫ్రెండ్స్‌కు అందివ్వండి. వాటిని వారు తీపి గుర్తులుగా దాచుకుంటారు. ఆ ఫొటోలను చూసినప్పుడల్లా మీరే గుర్తుకు వస్తారు.
* స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సారి వెరైటీగా జరుపుకోండి. ఒక్కోసారి జరుపుకునే వేడుక మీకు ఒక్కోలాంటి అనుభూతిని ఇస్తుంది. ఆ డే సందర్భంగా ఏదైనా యాక్టివిటీలు చేసేందుకు ప్లాన్ చేయండి. సినిమా లేదా కార్నివాల్‌కు వెళ్లేందుకు యత్నించండి. మ్యూజికల్ షోలో పాల్గొనేందుకు ట్రై చేయండి. ఎంత ఎక్కువ మంది స్నేహితులు ఉంటే అంత ఎక్కువగా ప్రోగ్రామ్‌లను ఎంజాయ్ చేయవచ్చు. అన్నీ కుదరకపోతే కనీసం పార్కుకైనా వెళ్లి సరదాగా గడపండి.
* స్నేహితుల దినోత్సవం ఒక్క రోజైనా ఆ రోజంతా మీరు మీ స్నేహితులతో గడిపేలా ఏర్పాట్లు చేసుకోండి. ఆ ఒక్క రోజుకు కుటుంబ సభ్యులను పట్టించుకోకండి. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు.. అనే వివరాలను మాత్రం ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పండి.
* ఫ్రెండ్‌షిప్ డే రోజున పాత స్నేహితులను కలవండి. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోండి. కొత్తగా ఎవరితోనైనా స్నేహం చేయండి. కొత్త ఫ్రెండ్స్‌ను పెంచుకోండి. మీ చిన్ననాటి స్నేహితులను కచ్చితంగా కలుసుకునే ఏర్పాటు చేయండి.
* మీకు మీ తల్లిదండ్రులు ఖర్చుల కోసం పాకెట్ మనీ ఇస్తుంటారు. మరి అనాథలకు అది ఉండదు కదా.. కనుక స్నేహితుల దినోత్సవం రోజున వారికి మీ పాకెట్ మనీలో నుంచి కొంత ఇవ్వండి. లేదా దాంతో వారికి ఉపయోగపడే పనిచేయండి. అది మీ స్నేహితులందరికీ జీవితాంతం గుర్తుండి పోతుంది.
* స్నేహితుల దినోత్సవం రోజున అనాథాశ్రమం లేదా వృద్ధాశ్రమాలకు వెళ్లండి. వారితో సరదాగా గడపండి. వారికి సహాయం చేయండి. లేదా మొక్కలను నాటండి. సమాజహిత కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. అది మీకు ఎంతో ఆత్మ సంతృప్తినిస్తుంది.
* గతంలో మీరు ఎవరైనా స్నేహితుడితో గొడవపడి అతనితో మాట్లాడడం మానేసి ఉంటే.. స్నేహితుల దినోత్సవం రోజున ఆ స్నేహితున్ని కలిసి వీలైతే సారీ చెప్పి.. మళ్లీ మాటలు కలపండి. మళ్లీ స్నేహితులుగా మారండి. మొహమాటానికి పోయి మంచి ఫ్రెండ్స్‌ను దూరం చేసుకోకండి.. హ్యాప్పీ ఫ్రెండ్‌షిప్ డే..!