నా యజమాని చెంతకు చేర్చండి.. పోలీసులకు ఓ కుక్క ఫిర్యాదు!

-

‘నేను దారితప్పి వచ్చాను. నన్ను నా యజమాని దగ్గరికి చేర్చండి’ అని ఓ కుక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేంటి! కుక్కకు మాటలే రావుగా! పోలీసులకు ఎలా ఫిర్యాదు చేస్తుంది అనుకుంటున్నారా? ఔనండీ.. నేను చెప్పేది నిజమే! మాటలు రాకపోయినా, తన ప్రవర్తనతోనే పోలీసులకు విషయం అర్థమయ్యేలా చేసింది ఓ తెలివైన కుక్క. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా..?

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఓ కుక్క దారితప్పింది. వీధులన్నీ తిరిగి వెతికినా యజమాని ఇళ్లు మాత్రం దొరకలేదు. వెతికీవెతికీ అలసిపోయిన కుక్క చివరకు ఓ పోలీస్‌స్టేషన్‌లో దూరింది. కుయ్‌.. కుయ్‌.. మని గొణుగుతూ పోలీసుల మీదికి ప్రేమగా ఎగరడం.. స్టేషన్‌ బయటకు దారిచూపడం చేసింది. దీంతో కుక్క ఏదో చెప్పాలనుకుంటుందని పోలీసులు గ్రహించారు. కానీ, ఏం చెప్పాలనుకుంటున్నదో అర్థం కాలేదు.

మరోవైపు అరగంట దాటినా కుక్క మాత్రం కనబడ్డ పోలీస్‌ మీదికల్లా ఎగురడం, స్టేషన్‌ బయటకు దారిచూపడం ఆపలేదు. దీంతో బాగా ఆలోచించిన పోలీసులకు ఆ కుక్క దారితప్పి వచ్చిందని, తన యాజమాని దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతోనే అలా ప్రవర్తిస్తున్నదని అర్థమైంది. అయితే, తన భావాన్ని వాళ్లు అర్థం చేసుకునేదాక కుక్క పడిన తపనకు పోలీసులు ఫిదా అయ్యారు. తర్వాత, కుక్కను మచ్చిక చేసుకుని రాత్రంతా తమతోనే స్టేషన్లో ఉంచుకున్నారు.

టెక్సాస్‌ పోలీసులు మరుసటి రోజు కుక్కను ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫొటోలను చూసి కుక్కను గుర్తుపట్టిన యజమాని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి దాన్ని తీసుకెళ్లాడు. దీనిపై స్పందిస్తూ పోలీసులు సోషల్‌ మీడియాలో మరో పోస్ట్ చేశారు. ‘గత రాత్రి ఒక కుక్క దారితప్పి మా స్టేషన్‌లోకి వచ్చింది. ఈ తెలివైన కుక్క రాత్రంతా మాతో సరదాగా గడిపింది. మాపై ఎంతో ప్రేమను చూపించింది. చివరికి అది సురక్షితంగా యాజమాని దగ్గరకు చేరినందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నది ఆ పోస్ట్‌ సారాంశం. ఏదేమైనా ఆ కుక్క తెలివికి అందరం హాట్సాఫ్‌ చెప్పాల్సిందే కదా!

Read more RELATED
Recommended to you

Latest news