అమెరికా రాజకీయాల్లో పెనుసంచలనం చోటుచేసుకుంది. ఏకంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు ఆమెకు డబ్బు ఇచ్చేందుకు చేసుకున్న ఒప్పందం బట్టబయలు కావడంతో ట్రంప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని న్యూయార్క్ మన్‌హటన్‌లోని కోర్టు ముందు హాజరుపరిచారు.
అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.45 గంటలు) న్యాయమూర్తి జువాన్ మెర్చన్ ఎదుటకు న్యాయవాదులతో కలిసి ఆయన వచ్చారు. ఆయనపై నమోదైన నేరాభియోగాలను న్యాయమూర్తి చదివి వినిపించారు. మొత్తం 34 అభియోగాలను ఆయనపై మోపారు. వాటన్నింటిలో తాను దోషిని కాదని న్యాయమూర్తికి ట్రంప్ విన్నవించారు.
అంతకుముందు ట్రంప్ 1.30 గంటల సమయంలో లొంగిపోయేందుకు కోర్టు హాలు వద్దకు చేరుకున్నారు. వెంటనే ఆయనను పోలీసులు అరెస్టు చేసి అటార్నీ కార్యాలయానికి తరలించారు. ఫింగర్‌ప్రింట్, ఫొటోలను తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టు హాలుకు తరలించారు. విచారణ అనంతరం ట్రంప్ కోర్టు నుంచి వెళ్లిపోయారు.