- కేరళ వ్యవసాయ మంత్రి విఎస్.సునీల్ కుమార్
తిరవనంతపురం : వచ్చేనెల 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటుంది తప్ప.. ఆ బడ్జెట్ తో రైతులకు ఒనగూరేది ఏమీ ఉండబోదని కేరళ రాష్ట్ర వ్యవసాయ మంత్రి విఎస్. సునీల్ కుమార్ అన్నారు. “కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే బడ్జెట్. అణగారిన వర్గాల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు లభించే అవకాశం లేదు” అని మంత్రి తాజాగా మీడియాతో వెల్లడించారు.
ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రైతులు వ్యతిరేకిస్తున్న మొండి తన వైఖరికి కట్టుబడి ముందుకు సాగుతోంది. ఇలా అయితే, రైతుల చేస్తున్న, వ్యవసాయ సంక్షోభ సమస్యలను ఎలా పరిష్కారిస్తారు? అంటూ కేరళ వ్యవసాయ మంత్రి విఎస్. సునీల్ కుమార్ అన్నారు. కేంద్రం తీసుకుంటున్న ప్రస్తుత చర్యల వల్ల రైతు ఉద్యమం మరింత ఉధృతం అయ్యే అవకాశముందని తెలిపారు.
ఇక కేంద్ర తీసుకుంటున్న పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలు చూస్తుంటే.. ప్రస్తుతం తీసుకురానున్న బడ్జెట్ సమాజానికి అనుకూలంగా ఉంటుందని తాను నమ్మడం లేదంటూ పేర్కొన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉంటే సంబంధాలను ప్రభుత్వం చెడగొట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు వ్యతిరేకంగా వారు అనేక చట్టాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇది బడ్జెట్ లో కూడా ప్రతిబింబిస్తుంది అని ఆయన అన్నారు.
కాగా, ఈ నెల 29న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, తొలి భాగం ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. రెండో భాగం సెషన్ మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతుంది. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్ సభ 4 నుంచి 9 గంటల వరకు జీరో అవర్, క్వశ్చన్ అవర్ తో పనిచేయనుంది.